పాక్​ది మళ్లీ అదే గుణం

పాక్​ది మళ్లీ అదే గుణం

వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా కాశ్మీర్​ని ప్రస్తావించకుండా ఉండదు పాకిస్థాన్. కరోనా వైరస్​పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లోనూ పాక్​ తన బుద్ధిని చూపించుకుంది. తన దేశంలో 52 కరోనా పాజిటివ్​ కేసులున్న సంగతిని పక్కనబెట్టి… కాశ్మీర్​లో ఇద్దరికి కరోనా సోకడాన్ని వేలెత్తి చూపించింది.

ప్రపంచమంతా కరోనా వైరస్​పై ఆందోళన పడుతోంది. పాక్​లోనూ కరోనా పాజిటివ్​ కేసులు 52కి చేరాయి. ఇరాన్​తో ఆ దేశానికి బోర్డర్​ ఉన్నందున అక్కడి నుంచి వస్తున్నవాళ్లతో కరోనా వైరస్​ వ్యాపిస్తున్నట్లు పాక్​ హెల్త్​ మినిస్ట్రీ గుర్తించింది.  ఒక్క సింధు రాష్ట్రంలోనే 34 కేసులు నమోదయ్యాయని, వీళ్లకు బోర్డర్​లోని క్వారంటైన్​లో చికిత్స చేస్తున్నామని ఆ రాష్ట్ర ప్రతినిధి బారిష్టర్​ మూర్తజా వహబ్​ చెబుతున్నారు. ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో సమన్వయం సాధిస్తే కరోనాని అడ్డుకోగలమని ఇండియా భావించింది. అందుకే ఈ వైరస్​ కంట్రోల్​పై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా చొరవ చూపించారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్​)లోని సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్​ ఏర్పాటు చేశారు. ఆదివారం  మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రెసిడెంట్లు​ గోటబయ రాజపక్స (శ్రీలంక), ఇబ్రహీం మహమ్మద్​ సాలిహ్​ (మాల్దీవులు), అష్రఫ్​ ఘని (అఫ్ఘాన్​), ప్రధాన మంత్రులు షేక్​ హసీనా (బంగ్లాదేశ్​), శర్మ ఓలి (నేపాల్​, లాటే త్సేరింగ్​ (భూటాన్) పాల్గొన్నారు.  పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మాత్రం తన స్పెషల్​ అసిస్టెంట్​ (హెల్త్​) జఫర్​ మీర్జాని పంపించడంతోనే పాక్​కి ఈ విషయం మీద ఏమాత్రం శ్రద్ధ లేదని తేలిపోయింది.

వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా కాశ్మీర్​ని ప్రస్తావించకుండా ఉండదు పాకిస్థాన్​. కరోనా వైరస్​పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లోనూ పాక్​ తన బుద్ధిని చూపించుకుంది. తన దేశంలో 52 కరోనా పాజిటివ్​ కేసులున్న సంగతిని పక్కనబెట్టి… కాశ్మీర్​లో ఇద్దరికి కరోనా సోకడాన్ని వేలెత్తి చూపించింది. దక్షిణాసియా దేశాలన్నీ ఈ మహమ్మారిని అరికట్టడానికి కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రపంచానికొక సందేశమివ్వాలన్నది మోడీ ఉద్దేశం. కరోనా వైరస్​పై పోరుకు పటిష్టమైన వ్యూహాన్ని రెడీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దానికి పాక్​ మినహా సార్క్​ దేశాలు సానుకూలంగా స్పందించాయి. అసలు పాల్గొంటుందా లేదా అనే డౌట్​ ఏర్పడిన దశలో ‘మా స్పెషల్​ అసిస్టెంట్​ మీర్జా హాజరవుతార’ని పాక్​ ఫారిన్​ మినిస్ట్రీ చెప్పింది. దాదాపుగా గంటన్నర సేపు సాగిన వీడియో కాన్ఫరెన్స్​లో… అగ్ర నేతలందరూ కరోనా వైరస్​  వ్యాపించకుండా తమ తమ దేశాల్లో తీసుకున్న చర్యలను షేర్​ చేసుకున్నారు.

పాక్​ ప్రతినిధి మాత్రం… జమ్మూ కాశ్మీర్​లో రెండు కోవిడ్​–19 వైరస్​ కేసులు వెల్లడి కావడంపట్ల ఆందోళన చెందారు. ‘హెల్త్​ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంపై అమలు చేస్తున్న ఆంక్షలు తక్షణం ఎత్తేయాలి. అక్కడి సమాచారం బయటకు రావడం లేదు. ఆంక్షలు ఉన్నందువల్ల జమ్మూ కాశ్మీర్​లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు. సార్క్​ దేశాలు తమ పరిధిలోని అన్ని ప్రాంతాలకు అత్యవసర సహాయాన్ని చేయగలగాలి. అక్కడి అవసరాలు గుర్తించి మందులు పంపడానికి, సహాయక చర్యల్లో పాల్గొనడానికి వీలు కల్పించాలి’ అన్నారు మీర్జా. దీని వెనుక ఉన్న దాగిన కుటిల బుద్ధిని ఇండియా వెంటనే గుర్తించి ఖండించింది.

‘పాకిస్థాన్​ పంపిన రిప్రజెంటేటివ్​కి మాట్లాడడమే రాలేదు. ఆయన మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన వైఖరి చాలా మూర్ఖంగా ఉంది. మనం మాట్లాడుకునేది మానవీయ అంశంపైన. పాకిస్థాన్​ మాత్రం దానిని రాజకీయం చేయాలని చూసింది’ అని ఇండియా పేర్కొంది. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఇంత తీవ్రమైన విషయంపై చర్చకు రాకుండా హెల్త్​ అసిస్టెంట్​ని పంపడం విడ్డూరం. నేపాల్​ ప్రధాని శర్మ ఓలి అనారోగ్యంతో ఉండికూడా వీడియో కాన్ఫరెన్స్​కి వచ్చారు. ఆయన అంతకుముందు రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే, ప్రతి ఒక్కరూ తమ బిజీ షెడ్యూల్​ని పక్కనబెట్టి కరోనా వైరస్​పై కాన్ఫరెన్స్​కి వచ్చారు. పాక్​ ప్రధాని రాలేదు సరికదా, ఆయన తరఫున వచ్చిన ప్రతినిధి తీరుకూడా నిర్లక్ష్యంగా ఉందని ఎనలిస్టులు అంటున్నారు.

ఈ విషయంలోనే కాకుండా, విదేశాల్లోని పాకిస్థాన్​ స్టూడెంట్లను తీసుకురావడంలోనూ ఇమ్రాన్​ నిర్లక్ష్యంగానే వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఇతర దేశాల్లో చిక్కుపడిపోయిన స్టూడెంట్లను తీసుకువచ్చే విషయంలో ఇండియా చాలా వేగంగా స్పందించింది. మన స్టూడెంట్ల విషయంలోనే కాకుండా సార్క్​ దేశాలవాళ్లనుకూడా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించింది. చైనా, ఇటలీ దేశాల్లో ఉన్నవాళ్లను ఇప్పటికే రప్పించింది. దీనిపై ఇండియా ఆఫర్​ ఇచ్చినాగానీ పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ స్పందించలేదు. దాంతో మన స్టూడెంట్లను మాత్రమే తీసుకుని ఎయిరిండియా విమానాలు వెనక్కి వచ్చేశాయి.

పాకిస్థాన్​కిది మామూలే

కాశ్మీర్​ విషయంలో తలదూర్చడం, ఏదోక విధంగా ఇండియాని తప్పుబట్టాలని చూడడం పాకిస్థాన్​కి బాగా అలవాటు. ఆర్టికల్​–370ని రద్దు చేయడంతో పాకిస్థాన్​కి ఎటూ పాలుపోవడం లేదు. ఇదొక సమస్యగా మార్చాలని యూఎన్​ వరకు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. ​‘కాశ్మీర్​ అంశాన్ని మొదటి నుంచీ అంతర్గత అంశం’గానే ఇండియా వాదిస్తూ వస్తోంది. దాంతో పాకిస్థాన్​ ప్రయత్నాలు ఫలించడం లేదు.

కరోనాతో కోట్లలో నష్టం

మూలుగుతున్న పాకిస్థాన్​పై కరోనా వైరస్​ వచ్చి పడింది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా బాగా నష్టపోయి ఉంది. అప్పులకు వడ్డీలు సైతం కట్టలేని స్థితిలో ఉంది. ఇలాంటి దశలో పాకిస్థాన్​లో 50కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్​ వల్ల పాకిస్థాన్​ ఎకానమీకి 6.10 కోట్ల డాలర్లు (పాక్​ రూపాయల్లో దాదాపు 969 కోట్లు) నష్టం తప్పదని ఆసియా డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఏడీబీ) చెప్పింది. అయినప్పటికీ కరోనాని అరికట్టడం కంటే కాశ్మీర్​ విషయంలో ఇండియాని ఇరికించడమే ముఖ్యమని పాకిస్థాన్ భావిస్తోంది.