సరిహద్దు వివాదాలు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందన్న కారణాలు తప్ప భారత్ - పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేకపోవడానికి పెద్దగా కారణాలేవి లేవు. ఈ కారణంగానే ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఓ యుద్ధంలా చూస్తారు. ఇందులో న్యాయముందీ.. ఇది అంగీకరించదగినదే. మరి పాకిస్తాన్‌కు.. ఆఫ్గనిస్తాన్‌కు ఉన్న వైర్యమేంటో తెలియదు కానీ, మ్యాచ్ ముగియగానే ఆ దేశ ప్రజలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక తాలిబన్లైతే తమ స్టయిల్‌లో ఆకాశం వైపు తుపాకులు గురిపెట్టి బుల్లెట్ల శబ్దాలు వినిపించారు.
ఈ మ్యాచ్‌లో మరో చెప్పుకోదగ్గ సంఘటన అంటే.. ఆఫ్ఘన్ క్రికెటర్లతో కలిసి భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సంబరాలు చేసుకోవడం. ఏ ఫార్మాట్‌లో నైనా పాకిస్థాన్‌పై అఫ్గాన్ జట్టుకు ఇదే తొలి విజయం. అందుకే వారు మ్యాచ్ పూర్తైన వెంటనే ఆనందంలో మునిగిపోయారు. చెపాక్ మైదానమంతా కలియ తిరుగతూ తమను మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్ పఠాన్.. రషీద్ ఖాన్ ఎదురుపడగానే అతన్ని ఆలింగనం చేసుకున్నారు. అతనితో కలిసి స్టెప్పులు వేశారు. ఆ దృశ్యాలు ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు మరింత ఆనందాన్ని పంచుతున్నాయి.
పఠాన్‌కు ఎందుకింత ఆనందం!
ఆఫ్గనిస్తాన్ గెలిస్తే ఇర్ఫాన్ పఠాన్‌కు ఎందుకింత ఆనందం అని అతన్ని ప్రశ్నిస్తున్నారు. అందరిలానే ఒక భారతదేశ పౌరుడిగా ఇర్ఫాన్ పఠాన్‌కు.. భారత్‌పై విషం చిమ్మే వారంటే నచ్చదు. భారత క్రికెట్‌పై విషం కక్కుతూ వారు రాసే వార్తలు అతనికి పడవు. ఈ విషయంలో అతని అభిప్రాయమేంటో బయట ప్రపంచానికి తెలియదు కానీ, బీసీసీఐని, భారత్ క్రికెట్‌ను విమర్శించే ఏ ఒక్కరిని పఠాన్ వదిలిపెట్టడు. వారం రోజుల క్రితం బీసీసీఐపై మీకీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇలానే స్పందించాడు. ఒకవేళ అతనిలా ఉండటమే కరెక్టేమో..
Rasid khan fulfilled his promise and I fulfilled mine. Well done guys @ICC @rashidkhan_19 pic.twitter.com/DKPU0jWBz9
— Irfan Pathan (@IrfanPathan) October 23, 2023
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. చెన్నై స్లో పిచ్‌పై ఇది మంచి స్కోరే అయినప్పటికి.. ఆఫ్ఘన్ బ్యాటర్ల పోరాటం ముందు అది చిన్నబోయింది. ఆ జట్టు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87) హాఫ్ సెంచరీలతో విజయానికి మంచి పునాది వేశారు. ఆ తరువాత వీరిద్దరూ ఔటైనా రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు ఆఫ్ఘన్ బౌలర్లు కూడా రాణించారు.