ముల్తాన్ : పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. జో రూట్ (176 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (141 బ్యాటింగ్) భారీ సెంచరీలతో చెలరేగడంతో.. బుధవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 492/3 స్కోరు చేసింది. 96/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రూట్ మూడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు.
జాక్ క్రాలీ (78)తో రెండో వికెట్‌కు 109, బెన్ డకెట్ (84)తో మూడో వికెట్‌కు 136 రన్స్ జత చేశాడు. తర్వాత బ్రూక్‌తో నాలుగో వికెట్‌కు అజేయంగా 243 రన్స్ జత చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను సుస్థిరం చేశాడు. షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా, ఆమెర్ జమాల్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 64 రన్స్ వెనకబడి ఉంది.
రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ ద్వారా రూట్ (12578).. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన అలిస్టర్ కుక్ (12472) రికార్డును బ్రేక్ చేశాడు.