ఆఫ్రిది దెబ్బకు రోహిత్ క్లీన్ బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఆఫ్రిది దెబ్బకు రోహిత్ క్లీన్ బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్‎తో జరుగుతోన్న ప్రతిష్టాత్మక మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. 4, 6, 4 బాది మాంచి టచ్‎లో కనిపించిన హిట్‎మ్యాన్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ వేసిన అద్భుతమైన యార్కర్‎కు రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచులో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్.. 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దీంతో 31 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శుభమన్ గిల్ (21), విరాట్ (0) కోహ్లీ క్రీజ్‎లో ఉన్నారు. 7 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి టీమిండియా 47 రన్స్ చేసింది. భారత్ గెలవాలంటే 43 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉంది. 

కాగా, అంతకుముందు టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత బౌలర్లు సత్తా చాటారు. ప్రత్యర్థి పాకిస్థాన్‎ను ఒక మాదిరి స్కోర్‎కే పరిమితం చేశారు. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. టాపార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ 68 పరుగులు చేసి పాక్ టాప్ స్కోరర్‎గా నిలిచాడు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‎కు మంచి ఆరంభం లభించింది. ఇమామ్ ఉల్ హక్(10), బాబర్ అజామ్(23) తొలి వికెట్ కు 50 బంతుల్లో 41 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ తీసుకున్నారు. మొదట తడబడిన వీరిద్దరూ.. ఆ తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. మూడో వికెట్‎కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‎ను చక్క బెట్టారు.

ALSO READ | Virat Kohli: వ‌న్డేల్లో కోహ్లీ అరుదైన ఘనత.. అజారుద్దీన్ రికార్డు బ్రేక్

ఈ దశలో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. దీంతో 14 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఖుష్దిల్ షా, అఘా సల్మాన్ 35 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సల్మాన్ తో పాటు పాక్ లోయర్ ఆర్డర్ విఫలమైనా చివరి వరకు క్రీజ్ లో ఉండి ఖుష్దిల్ షా (38) పాక్ స్కోర్ ను 240 పరుగులకు చేర్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణాలకు తలో వికెట్ దక్కింది.