Champions Trophy: లాథమ్, విల్ యంగ్ సెంచరీలు.. పాకిస్థాన్ ఎదుట భారీ టార్గెట్

Champions Trophy: లాథమ్, విల్ యంగ్ సెంచరీలు.. పాకిస్థాన్ ఎదుట భారీ టార్గెట్

చాంపియ‌న్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్‌కు నిరాశను మిగిల్చేలానే ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు చితక్కొట్టారు. విల్ యంగ్(107), టామ్ లాథమ్(118*) సెంచరీలు చేయగా.. చివరలో గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకం బాదాడు. దాంతో, కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది.

మురిపం కాసేపే..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. 73 పరుగులకే 3 వికెట్లు. ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే(10), కేన్ విలియంసన్(1), డారిల్ మిచెల్(10).. ముగ్గురూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో విల్ యంగ్- టామ్ లాథమ్ జోడి జట్టును ఆదుకున్నారు. పాక్ బౌలర్లను ఆటాడుకుంటూ నిలకడగా పరుగులు రాబట్టారు. తీరా క్రీజులో కుదురుకున్నాక.. పస లేని పాక్ బౌలింగ్ లైనప్‌ను చీల్చి చెండాడారు. ఈ జోడి  నాలుగో వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Also Read :- నా కొడుకుతో ఆడాలని ఉంది

ఫిలిప్స్ మెరుపులు

సెంచరీ అయ్యాక ధాటిగా ఆడబోయి యంగ్ ఔటైనా.. క్రీజులోకి వచ్సిన గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. షార్ట్ బౌండరీస్ లక్ష్యంగా చేసుకొని బౌండరీల వర్షం కురిపించాడు. అప్పటికే అలసిపోయిన పాక్ బౌలర్లు.. చేసేదేమీ లేక చేతులెత్తేశారు. దాంతో, కివీస్ బ్యాటర్లు అలవోకగా 300 దాటించేశారు. ఎంత సొంత పిచ్ అయినా 320 పరుగులు చేధించడమంటే కట్టి మీద సాము లాంటిదే. పాకిస్థాన్ బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతే.