ODI World Cup 2023: పాకిస్తాన్‌పై విజయం.. జై హనుమాన్ అని పలికిన సౌతాఫ్రికా క్రికెటర్

ODI World Cup 2023: పాకిస్తాన్‌పై విజయం.. జై హనుమాన్ అని పలికిన సౌతాఫ్రికా క్రికెటర్

శుక్రవారం పాకిస్థాన్‌- సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత మజాను పంచిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో పాకిస్తాన్ ఆఖరివరకూ పోరాడింది. ఒకానొక దశలో( 235/5) గెలుపు సఫారీ జట్టుదే అనుకున్నా..   ఆఖరిలో పాక్ బౌలర్లు విజృంభించడంతో మ్యాచ్ నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. చివరకు ఉత్కంఠపోరులో సఫారీ జట్టు.. పాకిస్థాన్‌పై వికెట్ తేడాతో విజయం సాధించింది. 

పాక్ నిర్ధేశించిన 271 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 36 ఓవర్ల వరకూ బాగానే రాణించినా.. ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కేవలం 25 పరుగుల వ్యవధిలోనే మిల్లర్(29), మార్కో జెన్ సెన్(20), మార్క్‌రమ్‌(91) వెనుదిరగడంతో మ్యాచ్ ఒక్కసారిగా హైవోల్టేజ్ సమరంలా మారిపోయింది. ఆఖరిలో ప్రొటీస్ జట్టు విజయానికి 11 పరుగులుకావాల్సి రావడం.. చేతిలో వికెట్ మాత్రమే ఉండడంతో బంతిబంతికి నరాలు తెగే ఉత్కంఠను పంచింది. పాక్ పేసర్లు శక్తికి మించి పోరాడడంతో గెలుపే వారిదే అనిపించింది. కానీ చివర్లో కేశవ్ మహారాజ్, షంసీ జోడి 11 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

జై శ్రీ హనుమాన్.. 

ఈ విజయం అనంతరం కేశవ్ మహారాజ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో  జై శ్రీ హనుమాన్ పోస్ట్ చేశాడు. భగవంతుడిపై భారం వేసి ఆడానని దీనర్థం. తనతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తబ్రేజ్ షాంసీ, ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కేశవ్ మహారాజ్ ప్రశంసించాడు. ఆఖరిలో జై శ్రీ హనుమాన్ అంటూ తన పోస్ట్‌ను ముగించాడు. ఈ  ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కాగా, భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ తరచూ ఇండియాకు విచ్చేసి ఇక్కడి హనుమంతుడి దేవాలయాలను సందర్శిస్తుంటారు. వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ముందు కూడా అతను తిరువనంతపురం ఆలయాన్ని సందర్శించారు.