PAK vs RSA: ఉత్కంఠపోరులో సౌతాఫ్రికా విజయం.. పాక్ పోరాటం ముగిసినట్టే

PAK vs RSA: ఉత్కంఠపోరులో సౌతాఫ్రికా విజయం.. పాక్ పోరాటం ముగిసినట్టే

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ ఆఖరివరకూ పోరాడినా విజయం వరించలేదు. చెన్నై వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో అనధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.

గత మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనపరిచిన పాక్ బౌలర్లు ఈ మ్యాచ్ లో మంచి పోరాటాన్ని కనపరిచారు. తొలుత విఫలమైనా ఆఖరిలో వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్ పై ఆసక్తి రేకెత్తించారు. ఒకానొక సమయంలో మ్యాచ్ దక్షణాఫ్రికా వైపే ఉన్నా.. మిల్లర్(29), మార్కో జెన్ సెన్(20), మార్క్‌రమ్‌(91) వెనుదిరగడంతో మ్యాచ్ ఒక్కసారిగా హైవోల్టేజ్ సమరంలా మారిపోయింది. బంతిబంతికి నరాలు తెగే ఉత్కంఠను పంచింది. 271 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ బ్యాటర్లు ఆఖరి  వికెట్‌కు చేధించారు. ఎయిడెన్‌ మార్క్‌రమ్‌(91) పరుగులతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 50 ఓవర్లు ఆడి ఉంటే కనీసం 300కు పైగా స్కోర్ చేసేవారు. కానీ వారిలో నిలకడ లోపించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (50; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు సౌద్‌ షకీల్‌ (52; 52 బంతుల్లో 7 ఫోర్లు), షాదాబ్‌ ఖాన్‌  (43; 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో తబ్రేజ్‌ షంషీ నాలుగు వికెట్లు తీసుకోగా.. జాన్సెన్‌కు మూడు వికెట్లు దక్కాయి.