క్రికెట్ మాత్రమే ఆడు.. ఉగ్రవాదం వద్దు: పాక్ క్రికెటర్‌‌ను హెచ్చరించిన బీజేపీ నేతలు

క్రికెట్ మాత్రమే ఆడు.. ఉగ్రవాదం వద్దు: పాక్ క్రికెటర్‌‌ను హెచ్చరించిన బీజేపీ నేతలు

ప్రశాంతపు భారత దేశంలో పాకిస్తాన్ క్రికెటర్ చేసిన ఓ ట్వీట్ వివాదస్పదం అవుతోంది. హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విజయాన్ని గాజా(పాలస్తీనా) ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. 

ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,000 మంది పౌరులను హతమార్చగా.. ఇజ్రాయెల్‌ సైన్యం అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. తీవ్రవాద సంస్థ హమాస్ నాయకులు, వారి రహస్య స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ చర్యలు హమాస్ ఉగ్రమూకలపైనే అయినా.. గాజా ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. దీంతో రిజ్వాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. గాజా ప్రజల కోసమే ఈ మ్యాచ్ గెలిచామన్నట్లు అభిప్రాయపడ్డాడు.

రిజ్వాన్ వ్యాఖ్యలు ఉగ్రవాద మనస్తత్వానికి ప్రతీక

రిజ్వాన్ ట్వీట్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. రిజ్వాన్ ఈ విజయాన్ని గాజాకు అంకితం చేయడం వల్ల పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని స్పష్టమైందని తెలిపాడు. అదే చైనాపై నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉయ్ఘర్ ముస్లింలకు అతను ఈ విజయాన్ని ఎందుకు అంకితం చేయలేదని ఆయన ప్రశ్నించారు. 

ఇక బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ.. క్రికెటర్ రిజ్వాన్ వ్యాఖ్యలు ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్థాన్ మనస్తత్వానికి ప్రతీక అని తెలిపారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: భారత జట్టుకు గోల్డ్ ఎలా ఇస్తారు.. మ్యాచ్ జరుగుంటే మేమే గెలిచేవాళ్లం!: ఆఫ్ఘన్ పేసర్

పాక్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర

ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 48.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్‌(113)తో పాటు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(131) సెంచరీతో చెలరేగారు. ముఖ్యంగా పాకిస్థాన్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు.