పాక్​ బొగ్గు​ గనిలో పేలుడు..12 మంది మృతి

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. హర్నై జిల్లా, జర్దాలో ఏరియాలోని బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి గనిలో  మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించిందని..ఆ టైంలో గనిలో ఇరవై మంది మైనర్లు ఉన్నారని వివరించారు. 

బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌‌ పూర్తయిందని చెప్పారు. సహాయక బృందాలు 12 మృతదేహాలను వెలికి తీశారని తెలిపారు. ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన మైనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పాకిస్తాన్ బొగ్గు ఉత్పత్తిలో 50 శాతం బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌ నుంచే ఉత్పత్తి అవుతుంది. అక్కడ భద్రతా పరికరాలు లేకపోవడంతో  తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్‌‌లో బలూచిస్తాన్‌‌లోని ఓ ప్రైవేట్ గనిలో మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. సెప్టెంబరులో జంషోరోలోని బొగ్గు గని కూలడంతో  ముగ్గురు కార్మికులు చనిపోయారు.

చైనా బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం

బీజింగ్: చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 51 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు.. ఎక్స్‌‌ప్రెస్‌‌వే టన్నెల్‌‌ గోడను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. మరో 37 మంది గాయపడ్డారు. హోహ్‌‌హోట్-~బీహై ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై మంగళవారం ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.