
- అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు
- దాంతో మేమే ఇబ్బందులు పడ్డాం
- మాపై ఇండియా ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తే యుద్ధమేనని కామెంట్
- నిధులతో పాటు శిక్షణ అందిస్తున్నం
- లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ఇప్పుడు లేనే లేదు
న్యూఢిల్లీ: ఇన్ని రోజులుగా తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ బుకాయించిన పాకిస్తాన్.. ఎట్టకేలకు ఇప్పుడు నిజాన్ని ఒప్పుకుంది. టెర్రరిస్టు సంస్థలకు నిధుల సమీకరణతో పాటు ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇస్తున్నామని అంగీకరించింది. ఈ విషయాలన్నీ స్వయంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌నే వెల్లడించారు. బ్రిటన్ మీడియా ‘స్కై న్యూస్’కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘పాకిస్తాన్ చాలా ఏండ్లుగా టెర్రరిస్టు సంస్థలకు నిధులు సమకూర్చడంతో పాటు ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇస్తున్నది కదా.. దీన్ని మీరు అంగీకరిస్తారా?’ అని జర్నలిస్ట్ యాల్దా హకీం ప్రశ్నించారు. దీనికి ఖవాజా ఆసిఫ్ జవాబిస్తూ.. ‘‘మేం గత మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల కోసం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం” అని ఒప్పుకున్నారు.
అయితే అది పెద్ద తప్పు అని, దాని వల్ల పాకిస్తాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదని తెలిపారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే, తమ దేశానికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని చెప్పారు. అఫ్గాన్‌లో సోవియట్ సేనలను ఓడించేందుకు అమెరికా టెర్రరిస్టులను వాడుకున్నదని ఆరోపించారు. కాగా, సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అలాగే 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో అల్ ఖైదా చేసిన ఉగ్రదాడి తర్వాత అఫ్గాన్‌పై అమెరికా చేసిన దాడికి మద్దతు ఇచ్చింది.
ఇండియా దాడికి దిగితే యుద్ధమే..
లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ఇప్పుడు లేనే లేదని ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తామే చేశామని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించగా, అసలు ఆ సంస్థ పేరు తాను ఎప్పుడూ వినలేదని ఆయన చెప్పారు. ‘‘లష్కరే తోయిబా పాత పేరు. అది ఇప్పుడు లేనే లేదు. భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని మా ప్రభుత్వం ఖండించింది. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే. భారత్ పహల్గాం దాడిని సాకుగా చూపి, మా దేశంలో సంక్షోభం సృష్టించాలని ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు. భారత్ మళ్లీ ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతున్నదా? అని ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ అలాంటిదే జరిగితే కచ్చితంగా యుద్ధానికి దారితీస్తుంది. రెండు న్యూక్లియర్ పవర్ దేశాల మధ్య యుద్ధం ఆందోళనకరమే” అని పేర్కొన్నారు.
టెర్రరిస్టులు.. ఫ్రీడమ్ ఫైటర్స్: పాక్ ఉప ప్రధాని
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ దాడికి పాల్పడి న టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ ఆయన మెచ్చుకున్నారు. ‘‘పహల్గాంలో దాడి చేసినోళ్లు ఫ్రీడమ్ ఫైటర్స్ అయి ఉంటారు. భారత్ మాపై దాడి చేస్తే, మేం తిరిగి దాడి చేస్తాం” అని అన్నా రు. కాగా, ఇషాక్ దార్ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డారు. ‘‘టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ మన ఉప ప్రధాని మెచ్చుకున్నరు. ఇది అవమానకరం.. ఉగ్రవాదాన్ని మనం ప్రోత్సహిస్తున్నా మని అంగీకరించినట్లయింది” అని ఆయన ట్వీట్ చేశారు.