వరల్డ్ కప్ లో భాగంగా నేడు మరో ఆసక్తిర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికాతో పసలేని పాకిస్థాన్ టీం తలపడబోతుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచుల్లో గెలిచిన సఫారీలు ఈ మ్యాచ్ లో ఓడిపోయినా పెద్దగా వచ్చిన నష్టం లేదు. కానీ పాకిస్థాన్ టీంకి మాత్రం ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమితో ఒక్కసారిగా కుదేలైన పాక్.. నేడు సౌత్ ఆఫ్రికా తో అగ్ని పరీక్షకు సిద్ధమైంది.
చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. వరుసగా రెండు మ్యాచులు గెలిచి మంచి ఊపు మీద ఉన్న పాక్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడింది. భారత్, ఆస్ట్రేలియా లాంటి జట్ల చేతిలో ఓడినా.. ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమి ఆ జట్టు జీర్ణించుకోలేకపోతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాక్ ఓడితే దాదాపు సెమీస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే సెమీస్ కు అర్హత సాధించాలంటే కనీసం ఆరు మ్యాచ్ లు గెలవాలి.
పాక్ ఈ మ్యాచ్ ఓడిపోయి తర్వాత మూడు మ్యాచుల్లో గెలిచినా ఐదు మ్యాచులవుతాయి. ఐదు మ్యాచ్ లు గెలిచినా సెమీస్ కు వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడంతో పాటు నెట్ రన్ రేట్ మెరుగా ఉండాలి. ఇదంతా జరగాలంటే అద్భుతం జరగాలి. దీంతో పాక్ సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ తో పాటు మిగిలిన మ్యాచ్ లు కూడా పాక్ ఖచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సెమీస్ కు మరింత చేరువవుతుంది. మొత్తానికి పాక్ సెమీస్ లోకి అడుగుపెట్టాలంటే నేడు గెలవడంతో పాటు మిగిలిన ఆ తర్వాత జరిగే మూడు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో పాక్ తనలోని కొత్త ఆటతీరును చూపిస్తుందో లేకపోతే అలవాటు ప్రకారం పెద్ద జట్ల మీద చతికిలపడుతుందో చూడాలి. చరిత్ర చూసుకుంటే 1999 నుంచి పాక్ పై దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ లో ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఈ ఒక్క విషయం మాత్రం పాక్ కు ఊరట కలిగిస్తుంది.