అఫ్గాన్‌‌పై పాక్‌‌ వైమానిక దాడి..46 మంది మృతి

అఫ్గాన్‌‌పై పాక్‌‌ వైమానిక దాడి..46 మంది మృతి
  • అఫ్గాన్‌‌పై పాక్‌‌ వైమానిక దాడి..46 మంది మృతి 
  • ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబాన్ ప్రభుత్వం  

కాబూల్‌‌: అఫ్గానిస్తాన్‌‌పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 46 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పక్టికా ప్రావిన్స్‌‌లోని బర్మల్ జిల్లాలో నాలుగు ఏరియాలు టార్గెట్ గా దాడులు జరిగాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ బుధవారం వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారని తెలిపారు. మరో ఆరుగురు గాయపడ్డారని..గాయపడిన వారిలోనూ ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని చెప్పారు. పాక్ దాడులను తాలిబన్ రక్షణ శాఖ ఖండించింది.

 ఇది పిరికిపంద చర్యగా అభిప్రాయపడింది. దేశ భూభాగాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం తమ హక్కు అని.. పాక్ పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారని బర్మల్ నివాసి ఒకరు వెల్లడించారు. మరో ఇంట్లో ముగ్గురు మృతి చెందారని, గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, ఈ ఆరోపణలపై పాక్ స్పందించలేదు. 2021లో అఫ్గానిస్తాన్‌‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది.

 అప్పటి నుంచి పాక్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. కాబూల్‌‌లోని తాలిబాన్ అధికారులు మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తున్నారని, వారితో తమ దేశంపై దాడి చేయిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తాలిబన్ ఖండిస్తున్నది. పాకిస్తానే తమపై టెర్రర్ అటాక్స్ చేస్తున్నదని తెలిపింది. ఇరు దేశాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగానే పాక్ వైమానిక దాడులకు పాల్పడింది.