పంట పొలాల్లో కుప్పకూలిన పాక్ మిరాజ్ యుద్ధ విమానం

పంట పొలాల్లో కుప్పకూలిన పాక్ మిరాజ్ యుద్ధ విమానం

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‎లో విమాన ప్రమాదం జరిగింది. పాక్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన మిరాజ్ శిక్షణ యుద్ధ విమానం పంజాబ్ ప్రావిన్స్‎లోని పంటపొలాల్లో కుప్ప కూలింది. స్వల్ప గాయాలతో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన లాహోర్‌కు నైరుతి దిశలో 350 కి.మీ దూరంలో ఉన్న వెహారి జిల్లా శివారులోని రట్టా టిబ్బాలో చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ పైలెట్లను చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు. 

ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘వెహారీ నగరానికి సమీపంలోని థింగి విమానాశ్రయం నుంచి రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరిన మిరాజ్ యుద్ధ విమానం కొద్దిసేపటికే మురు డిపో సమీపంలో కూలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం లేదా భవనానికి ఎటువంటి నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్నాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు.