14 గంటల సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

14 గంటల సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

పాకిస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలోని లోతైన లోయలో వందల మీటర్ల ఎత్తులో వేలాడుతున్న కేబుల్ కారులో చిక్కుకున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. దాదాపు 14 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత వారిని విజయవంతంగా రక్షించినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కాకర్ తెలిపారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బట్టాగ్రామ్ జిల్లాలో ఒక నది లోయను ప్రయాణీకులు దాటుతుండగా కేబుల్ ఒకటి తెగడంతో ఆరుగురు పిల్లలు, ఇద్దరు పెద్దలు గాలిలోనే చిక్కుకుపోయారు. పిల్లలు పాఠశాలకు వెళుతుండగా బట్టగ్రామ్ జిల్లా అల్లై తహసీల్‌లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. “పిల్లలందరూ విజయవంతంగా, సురక్షితంగా రక్షించబడడం చాలా ఉపశమనం కలిగించింది. మిలిటరీ, రెస్క్యూ విభాగాలు, జిల్లా పరిపాలనతో పాటు స్థానిక ప్రజల టీమ్‌వర్క్ బాగా పనిచేసింది” అని ప్రధాన మంత్రి కాకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రయాణం మధ్యలో ఏం జరిగింది?

ఈ ప్రాంతంలో రోడ్లు గానీ, వంతెనలు గానీ లేనందున నదుల మీదుగా రవాణా చేయడానికి స్థానికులు కేబుల్ కారును ప్రైవేట్‌గా నడుపుతున్నారని అసిస్టెంట్ కమిషనర్ (ఎసి) జవాద్ హుస్సేన్ తెలిపారు. ఈ కేబుల్ కారు ఝాంగ్రీ నదితో పాటు ఎత్తైన పర్వతాలు, ఎత్తైన కొండలతో కూడిన లోతైన లోయ మధ్యలో గంటల తరబడి అలా వేలాడుతూనే ఉండిపోయింది. చిక్కుకుపోయిన ప్రయాణికులను వెలికితీసే రెస్క్యూ ఆపరేషన్ ఉదయం ప్రారంభమైనా.. సాయంత్రం వరకు ఇద్దరు పిల్లలను కూడా రక్షించలేకపోయారు. నాలుగు హెలికాప్టర్ల సాయంతో  సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు పలు ప్రయత్నాల తర్వాత ప్రతికూల వాతావరణం మధ్య సాయుధ బలగాలు వారిని రక్షించాయి. వారిని రక్షించే సమయంలో చీకటి అలుముకోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా వైమానిక ఆపరేషన్ ఆపివేయబడిందనిస్టేట్ బ్రాడ్‌కాస్టర్ PTV న్యూస్ నివేదించింది.  ఈ ప్రాంతంలో రహదారి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రతిరోజూ కనీసం 150 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు కేబుల్ కారులో ఈ ప్రమాదకర ప్రయాణం చేస్తుంటారని స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు.