54 ఏండ్ల తర్వాత  పాక్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం షురూ

54 ఏండ్ల తర్వాత  పాక్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం షురూ

న్యూఢిల్లీ: యాభై నాలుగేండ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ ప్రారంభమైంది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి కార్గో పార్సెల్ పాకిస్తాన్​లోని కరాచీ పోర్ట్ నుంచి బంగ్లాలోని ఢాకాకు బయల్దేరిందని మీడియావర్గాలు వెల్లడించాయి. ఈ ఫిబ్రవరి మొదటివారంలోనే ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్​తో 50 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సరుకు రవాణా రెండు షిప్టుల్లో పూర్తికానుంది.

మార్చిలో రెండో విడతగా ఇంకో 25 వేల టన్నుల బియ్యాన్ని పాకిస్తాన్.. బంగ్లాదేశ్​కు పంపించనుంది. ‘‘1971లో విడిపోయిన తర్వాత మొదటిసారిగా సరుకుతో పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ నౌక బంగ్లాదేశ్ కు వెళ్తోంది. ఇరు దేశాల సముద్ర వాణిజ్య సంబంధాల్లో ఇది ముఖ్యమైన మైలురాయి”అని ఎక్స్​ఫ్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. పోయినేడాదిలో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నప్పటి నుంచి పాక్, బంగ్లా మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి.