
- హిందువుల కంటే మేం డిఫరెంట్.. అందుకే దేశ విభజన
- పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కామెంట్స్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఇస్లామాబాద్‌కు అది జీవనాడి అని, దానిని పాకిస్తాన్మర్చిపోదని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విదేశాలలో నివసిస్తున్న పాకిస్తానీయుల సమావేశంలో మాట్లాడారు. "మీరు మీ పిల్లలకు పాకిస్తాన్ స్టోరీని చెప్పాలి. మన పూర్వీకులు ప్రతి అంశంలోనూ మనం హిందువుల కంటే భిన్నంగా ఉన్నామని భావించారు.
అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది" అని పేర్కొన్నారు. "ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా? " అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు బలూచిస్థాన్ గర్వకారణమని, కాశ్మీర్ విషయంలోనూ తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. కాశ్మీర్ సోదరులను తాము అలా వదిలేయబోమని అన్నారు.
ఖాళీ చేయడమే మీకు మిగిలిన బంధం: భారత్
కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌తీవ్రంగా మండిపడింది. కాశ్మీర్.. ఇస్లామాబాద్‌కు జీవనాడి అంటూ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "విదేశీ వస్తువు జీవనాడి ఎలా అవుతుంది? కాశ్మీర్ భారత్‌లోని కేంద్ర పాలిత ప్రాంతం. పాకిస్థాన్‌తో దానికి ఉన్న ఏకైక సంబంధం.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడమే" అని ఆయన వ్యాఖ్యానించారు.