
- తహవుర్ రాణా విచారణతో వెలుగులోకి
- ఆర్మీ మెడికల్ కోర్లో సేవలు
- సర్వీస్ నుంచి బయటికొచ్చినా ఆర్మీ డ్రెస్‌లోనే..
- టెర్రరిస్ట్ క్యాంపులకు వెళ్లినప్పుడల్లా అదే డ్రెస్
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడి కుట్రదారు తహవ్వుర్ రాణాను ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్‌లోని అత్యంత హై సెక్యూరిటీ సెల్లో ఉంచి విచారిస్తున్నారు. సీసీ టీవీ నిఘా మధ్య ఇన్వెస్టిగేషన్ శుక్రవారం ప్రారంభమైంది. విచారణకు తొలి రోజు సహకరించలేదని, శనివారం తన గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ అధికారుల ద్వారా తెలిసింది.
పాకిస్తాన్ ఆర్మీ యూనిఫాం అంటే రాణాకు ఎంతో ఇష్టం. మెడికల్ డిగ్రీ పొందిన వెంటనే పాక్ ఆర్మీలోని మెడికల్ కార్ప్స్‌లో చేరాడు. తర్వాత ఉద్యోగం వదిలేసినప్పటికీ.. పాకిస్తాన్ మిలిటరీ నిఘా విభాగానికి చెందిన వ్యక్తులు, లష్కరే తొయిబా టెర్రరిస్టులను కలిసినప్పుడల్లా ఆ యూనిఫాంను ధరించేవాడని తెలిసింది. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులకు వెళ్లినప్పుడల్లా పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్సులే వేసుకునేవాడట.
నాన్న ప్రిన్సిపాల్.. ఇద్దరు తోబుట్టువులు
రాణా ముందుగా తన పర్సనల్ విషయాలు చెప్పాడు. ‘‘పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని చిచావత్ని అనే గ్రామంలో పుట్టాను. మా నాన్న స్కూల్ ప్రిన్సిపాల్. మేము ముగ్గురు అన్నదుమ్ములం. అందులో ఒకరు పాకిస్తాన్ ఆర్మీలో సైకియాట్రిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇంకో అతను జర్నలిస్ట్‌గా ఉన్నాడు. హసనబ్దల్లోని కేడెట్ కాలేజీలో ఓ ప్రోగ్రామ్‌కు హాజరైనప్పుడు డేవిడ్ హెడ్లీని ఫస్ట్ టైమ్ కలిశాను. అతను ఇప్పుడు అమెరికా జైల్లో ఉన్నాడు. నా భార్య పేరు సమ్రాజ్ రాణా అక్తర్. 1997లో మేము కెనడాకు షిఫ్ట్ అయ్యాం. అక్కడ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాం. తర్వాత హలాల్ మాంసం వ్యాపారం చేశాం’’ అని రాణా చెప్పాడు.
హెడ్లీ కన్సల్టెంట్‌గా నటించేవాడని సమాచారం.
గ్లోబల్ టెర్రరిస్ట్ సాజిద్ మీర్ అత్యంత సన్నిహితుడు
మెడికల్ డిగ్రీ పొందిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కోర్లో రాణా జాయిన్ అయ్యాడు. సర్వీస్ నుంచి బయటికొచ్చినప్పటికీ అదే డ్రెస్ వేసుకుని క్యాంపులను సందర్శించేవాడు. గ్లోబల్ టెర్రరిస్ట్ సాజిద్ మీర్‌తో తరుచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. 26/11 అటాక్‌లో మెయిన్ హ్యాండ్లర్. చాబాద్ హౌస్ ముట్టడించి ఆరుగురిని చంపేశాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అమెరికాలో సాజిద్‌పై రూ.43 కోట్ల రివార్డు కూడా ఉంది.
దుబాయ్ వ్యక్తి ఎవరు?
దుబాయ్ వ్యక్తి అంశం కూడా విచారణలో కీలకంగా మారింది. ముంబై దాడులకు ముందే ఆ వ్యక్తిని దుబాయ్‌లో రాణా తన భార్యతో సహా వెళ్లి కలిశాడని తెలుస్తున్నది. దాడులు జరుగుతాయని అతడికి ముందే తెలుసనే విషయాన్ని ఎన్ఐఏ అధికారులు అమెరికాతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ వ్యక్తి ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇండియాకు వెళ్లొద్దని రాణాకు సలహాకూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది.