
- పాక్ కరెన్సీలో ప్రభుత్వం నజరానా
- కోచ్‌కు అరకోటి.. మామకు బర్రె బహుమతి
లాహోర్: పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు ఆ దేశ ప్రభుత్వం తమ కరెన్సీలో 10కోట్ల రూపాయల నజరానా అందించింది. ఇండియా కరెన్సీలో ఇది రూ. 3 కోట్లు రూపాయలు. నదీమ్ సొంతూరు మియాన్ చున్నుకు వెళ్లిన పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ చెక్‌తో పాటు ఫైనల్లో అతనుజావెలిన్ విసిరిన దూరాన్ని చూపేలా ‘పీఏకే 92.97’ నంబర్‌ప్లేట్‌తో కూడిన హోండా సివిక్ కారును అందజేశారు. ‘దేశం గర్వపడేలా చేసిన అర్షద్ తాను పొందే ప్రతిదానికి అర్హుడు’ అని సీఎం పేర్కొన్నారు. నదీమ్ కోచ్ సల్మాన్ ఇక్బాల్ ను కూడా సీఎం కలిసి తనకు 50 లక్షల (పాక్ కరెన్సీ) చెక్‌ను అందజేశారు. అర్షద్‌కు పిల్లనిచ్చిన మామ మహ్మద్ నవాజ్ 8 లక్షల విలువ చేసే బర్రెను గిఫ్ట్‌గా ఇచ్చారు. గ్రామాల్లో బర్రెను బహుమతిగా ఇవ్వడాన్ని చాలా గౌరవంగా భావిస్తారని నవాజ్ తెలిపారు.
అర్షద్‌ను కలిసిన లష్కరే టెర్రరిస్ట్
లష్కరే తోయిబా టెర్రరిస్ట్ మహ్మద్ హారిస్ దార్.. అర్షద్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముస్లిం కమ్యూనిటీ గర్వపడేలా చేశావని హారిస్ దార్.. అర్షద్‌తో వ్యాఖ్యానించాడు.