ఇరాన్ పై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని సరవన్ నగరానికి సమీపంలో ఉన్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేస్తుంది. పాకిస్తాన్ నుంచి అనేక క్షిపణులు ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరిహద్దు గ్రామాన్ని తాకినట్లు ఆ ప్రావిన్స్‌కు చెందిన భద్రతా అధికారి తెలిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది : పాకిస్తాన్
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సున్ని మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై మంగళవారం ఇరాన్ జరిపిన దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలో ఇరాన్.. మిసైల్స్ దాడులకు పాల్పడిందని, దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని ప్రకటించింది. మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్న ఇరాన్ ప్రకటనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇరాన్లో ఉన్న తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంటామని వెల్లడించింది. అదేవిధంగా, తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడింది. ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే పొరుగు దేశాల మధ్య సంబంధాలు తెగిపోతాయని హెచ్చరించింది.