పాకిస్తాన్లో సూసైడ్ బాంబ్ : 52 మంది స్పాట్ డెడ్

పాకిస్తాన్లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్లో బాంబు పేలింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో  ఆత్మాహుతి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందారు.    మరో 100 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  నవాజ్ గిష్కోరి కూడా ఉన్నారు.  

ALSO READ :  అహంకారం దించారు : ప్రభుత్వ స్కూల్ టీచర్ అరెస్టు.. పిల్లలతో ఇలానా చేయించేది..

ముహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని  మస్తుంగ్ జిల్లాలో  అల్ఫాలా రోడ్‌లోని  మదీనా మసీదు వద్ద ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52  మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 డీఎస్పీ  నవాజ్ గిష్కోరి కారు సమీపంలోనే సూసైడ్ బాంబార్.. తనను తాను పేల్చుకున్నాడని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ జావేద్ లెహ్రీ వెల్లడించారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.  తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించారు. బలూచిస్థాన్ లోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు.

ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. అయితే పాకిస్తాన్ తాలిబాన్ ప్రమేయం ఉందన్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.  

మరోవైపు మస్తుంగ్‌ జిల్లాలో పేలుడు సంభవించడం సెప్టెంబర్ లో ఇది రెండోసారి. సెప్టెంబర్ మొదటివారంలో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో  పేలుడు జరిగింది. ఈ ఘటనలో జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్  నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా 11 మంది గాయపడ్డారు. తాజాగా జరిగినది రెండోది. ఈ ఘటనలో ఇప్పటికే 52 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.