హైదరాబాద్, వెలుగు: రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్ హైదరాబాద్ గడ్డపై వరల్డ్ కప్ వేటను ఘన విజయంతో షురూ చేసింది. టాప్ ఆర్డర్ నిరాశ పరిచినా.. మిడిలార్డర్, బౌలర్లు సత్తాచాటడంతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో పాక్ 81 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 రన్స్‌కు ఆలౌటైంది.
మొహమ్మద్ రిజ్వాన్ (75 బాల్స్‌లో 8 ఫోర్లతో68), సౌద్ షకీల్ (52 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో68) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మొహమ్మద్ నవాజ్ (39), షాదాబ్ ఖాన్ (32) కూడా రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లీడె (4/62) నాలుగు, అకెర్‌మన్ (2/39) రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో డచ్ టీమ్ 41 ఓవర్లలో 205 రన్స్‌కే ఆలౌటైంది. డి లీడె (68 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), విక్రమ్‌జీత్ సింగ్ (67 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) ఫిఫ్టీలతో పోరాడారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ (3/43), హసన్ అలీ (2/33) రెండు వికెట్లతో రాణించారు. షకీల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆదుకున్న రిజ్వాన్, షకీల్
టాస్ నెగ్గిన డచ్ టీమ్ సూపర్ బౌలింగ్‌తో పాక్ టాపార్డర్‌ను దెబ్బకొట్టింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ ఫఖర్ జమాన్ (12)ను వాన్ బీక్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే కెప్టెన్ బాబర్ ఆజమ్ (5)ను అకెర్‌మన్, ఇమామ్ ఉల్ హక్ (15) వాన్ మీకెరెన్ ఔట్ చేయడంతో పాక్ 38/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జాగ్రత్తగా ఆడుతూ 20 ఓవర్లలో వంద, 27 ఓవర్లలో 150 దాటించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. అయితే, 29వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్.. షకీల్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 120 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు.
ఈ టైమ్‌లో డి లీడె జోరు మొదలైంది. 33వ ఓవర్లో రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. ఇఫికార్ అహ్మద్ (9)ను కూడా పెవిలియన్ చేర్చడంతో పాక్ 188/6తో తడబడింది. కొత్తగా వచ్చిన నవాజ్, షాదాబ్ వేగంగా ఆడి 43 ఓవర్లలో స్కోరు 250 దాటించారు. కానీ, తర్వాతి ఓవర్లోనే డి లీడె వరుస బాల్స్‌లో షాదాబ్, హసన్ అలీ (0) వికెట్లు పడగొట్టాడు. నవాజ్ రనౌట్‌కాగా, చివర్లో షాహీన్ (13 నాటౌట్)తో కలిసి 21 రన్స్ జోడించిన రవూఫ్ (16) లాస్ట్ వికెట్‌గా ఔటయ్యాడు.
పోరాటం కాసేపే..
బంతితో మెప్పించిన నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లో ఫెయిలైంది. విక్రమ్‌తో తొలి వికెట్‌కు 28 రన్స్ జోడించిన ఒడౌడ్ (5)ను షాహీన్ షా ఆరో ఓవర్లో ఔట్ చేశాడు. 12వ ఓవర్లో అకెర్‌మన్ (17)ను ఇఫ్తికార్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ టైమ్‌లో విక్రమ్, డి లీడె మూడో వికెట్‌కు 70 రన్స్ జోడించారు. దాంతో ఓదశలో 120/2తో నిలిచిన డచ్ టీమ్ రేసులోకి వచ్చేలా కనిపించింది. అయితే, 24వ ఓవర్లో స్పిన్నర్ షాదాబ్ గూగ్లీకి విక్రమ్.. డీప్ మిడ్‌వికెట్‌లో జమాన్‌కు చిక్కాడు. తెలుగు ఆటగాడైన తేజ నిడమనూరు (5)... రవూఫ్ వేసిన క్రాస్ సీమర్‌కు బౌండ్రీ దగ్గర జమాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అదే ఓవర్లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే షాహీన్ బౌలింగ్‌లో జుల్ఫికర్ (10) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక ధాటిగా ఆడుతున్న డి లీడెను స్పిన్నర్ నవాజ్ బౌల్డ్ చేయగా... మెర్వె (4) రనౌటయ్యాడు. చివర్లో వాన్ బీక్ (28 నాటౌట్) మెరుపులతో నెదర్లాండ్స్ స్కోరు 200 దాటింది. మీకెరెన్ (7) నిరాశపర్చడంతో 9 ఓవర్లు మిగిలుండగానే డచ్ టీమ్ పోరాటం ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్: 49 ఓవర్లలో 286 ఆలౌట్ (రిజ్వాన్ 68, షకీల్ 68, డి లీడె 4/62).
నెదర్లాండ్స్: 41 ఓవర్లలో 205 ఆలౌట్ (డి లీడె 67, విక్రమ్‌జీత్ 52, రవూఫ్ 3/43).