NZ vs PAK: వరుసగా 8 ఓటములు..రెండు నెలల తర్వాత మ్యాచ్ నెగ్గిన పాకిస్థాన్

NZ vs PAK: వరుసగా 8 ఓటములు..రెండు నెలల తర్వాత మ్యాచ్ నెగ్గిన పాకిస్థాన్

భారత్ వేదికగా జరిగిన 2023 లో వన్డే వరల్డ్ కప్ సెమీస్ కు చేరడంలో విఫలమైన పాకిస్థాన్.. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో తొలి విజయాన్ని నమోదు చేయడానికి 9 మ్యాచ్ లు అవసరమయ్యాయి. ఫార్మాట్ ఏదైనా రెండు నెలలుగా ఓటములతో విఫలమవుతన్న పాక్ జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసుకుంది. న్యూజిలాండ్ తో చివరి టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన పాక్.. వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా పాక్ 1-4 తేడాతో వైట్ వాష్ కాకుండా తప్పించుకుంది.   
 
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.  న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, మాట్‌ హెన్రీ, ఫెర్గూసన్‌, సోధీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫకర్ జమాన్ 33 పరుగులతో వేగంగా పరుగులు చేశాడు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. కేవలం 92 పరుగులకే అనూహ్యంగా ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ చేసిన 26 పరుగులే టాప్ స్కోర్. పార్ట్ టైం బౌలర్ ఇఫ్తికార్ 3 వికెట్లు తీసాడు. షాహీన్‌ షా అఫ్రిది, మహ్మద్‌ నవాజ్‌ కు రెండు వికెట్లు దక్కాయి.         
              
వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిన పాక్.. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు ముందు జట్టును ప్రక్షాళన చేసింది. చీఫ్ సెలక్టర్ గా వహాబ్ రియాజ్, డైరెక్టర్ గా మహమ్మద్ హఫీజ్ ను నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. పాక్ క్రికెట్ లో ఇన్ని భారీ మార్పులు జరిగినా పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా  0-3 తేడాతో వైట్ వాష్ అయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టినా పాక్.. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.