
- 3 గ్రూపులుగా దేశాల విభజన.. పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే చాన్స్
- జాబితాలో పాక్, భూటాన్, మయన్మార్, అఫ్గాన్, ఇరాన్, సిరియా దేశాలు
- మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించానన్న ట్రంప్
- 24 గంటల్లో యుద్ధం ఆపుతానని వ్యంగ్యంగానే అన్నానని వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల పౌరులు తమ దేశంలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఆయా దేశాలను మూడు గ్రూపులుగా విభజించి, పూర్తిగా లేదా పాక్షికంగా లేదా కొన్ని మినహాయింపులతో వీసాలను రద్దు చేసే అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా భావించే ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా చూసేందుకు గాను నిబంధనలను కఠినతరం చేయాలంటూ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జనవరి 20వ తేదీనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
ఇందుకోసం మార్చి 21లోగా ఆయా దేశాలను గుర్తించి, జాబితా తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆర్డర్ మేరకు తాజాగా వీసా ఆంక్షలు విధించాల్సిన ఆయా దేశాలను గుర్తించిన అధికారులు మూడు వేర్వేరు గ్రూపులుగా జాబితాను తయారు చేశారని ఒక ఇంటర్నల్ మెమోను ప్రస్తావిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ, న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించాయి.
మూడు గ్రూపులుగా దేశాల విభజన..
యూఎస్ వీసా ఆంక్షలను ఎదుర్కోనున్న 41 దేశాలలో.. ఫస్ట్ గ్రూప్ లో అఫ్గానిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, నార్త్ కొరియా సహా 10 దేశాలు ఉన్నాయని, ఈ దేశాల పౌరులకు పూర్తిగా వీసాలను రద్దు చేయనున్నట్టు తెలిపింది. ఇక సెకండ్ గ్రూప్ లో ఎరిట్రియా, హైతీ, లావోస్, సౌత్ సూడాన్ దేశాలు ఉండగా, వీటిపై టూరిస్ట్, స్టూడెంట్, ఇమిగ్రేషన్ వీసాలను కొన్ని మినహాయింపులతో, పాక్షికంగా రద్దు చేయనున్నారు. అలాగే థర్డ్ గ్రూప్ లో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ సహా 26 దేశాలు ఉన్నాయి. అమెరికా వీసాలకు అప్లై చేసే వ్యక్తుల సమాచారాన్ని స్క్రీనింగ్ చేయడంలో లోపపూరిత విధానాలు అనుసరిస్తున్నందున ఈ దేశాల పౌరులకు వీసాల జారీపై పాక్షికంగా ఆంక్షలు పెట్టనున్నారు. అయితే, 60 రోజులలోపు ఈ దేశాలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు గడువును ఇవ్వనున్నారు. కాగా, ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2018లోనూ 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. తాజాగా మరిన్ని దేశాలపై అలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు.
మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించా
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశాధినేతలు ఇటీవల వాషింగ్టన్లో పర్యటించిన సందర్భంగా సిటీ అందంగా కనిపించేలా రోడ్ల పక్కన, ఫెడరల్ బిల్డింగుల వద్ద టెంట్లు, గ్రాఫిటీ (గోడలపై రాతలు, బొమ్మలు)లను తొలగింపచేసి క్లీన్ చేయించానని ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. వివిధ దేశాల అధినేతలు తనను కలిసేందుకు వచ్చినప్పుడు ప్రపంచం దృష్టి అంతా వాషింగ్టన్ మీద ఉంటుందని, అందుకే తమ రాజధాని గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకునేలా సిటీని తీర్చిదిద్దాలని ఆదేశించానన్నారు.
రోడ్లపై గుంతలు కూడా పూడ్చి, విరిగిపోయిన బ్యారియర్స్ ను మార్చేసి సిటీని అందంగా మార్చడంలో వాషింగ్టన్ డీసీ మేయర్ మురీల్ బౌజర్ కూడా కృషి చేశారని మెచ్చుకున్నారు. ‘‘మేం ఈ గొప్ప రాజధానిని క్లీన్ చేస్తున్నాం. ఇదేమీ నేరం కాదు. భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇతర దేశాల అధినేతలు ఇటీవల నన్ను కలిసేందుకు వచ్చారు. వాళ్లు మన రోడ్ల పక్కన టెంట్లను, గ్రాఫిటీలను, గుంతలు, విరిగిపోయిన బ్యారియర్లను చూడాలని నేను అనుకోలేదు. అందుకే వాటన్నింటినీ తొలగించి సిటీని క్లీన్ చేయించాం. అలాగే వాషింగ్టన్ ను నేర రహిత రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన తెలిపారు.
యుద్ధం ఆపుతానని వ్యంగ్యంగానే అన్నా
మూడేండ్ల కిందట తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేదే కాదని, తాను మళ్లీ ప్రెసిడెంట్ అయితే 24 గంటల్లోనే ఆ యుద్ధాన్ని ఆపుతానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పదే పదే ఊదరగొట్టిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చేశారు. తాను కొంచెం వ్యంగ్యంగానే ఆ మాటలు అన్నానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం జరిగి ఉండేదే కాదని చెప్పేందుకే అలా 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని వ్యంగ్యంగా చెప్పాల్సి వచ్చిందన్నారు. అయితే, నిరుడు ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ లో కూడా ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లోనే ఆపుతానన్నారు. అప్పటి ప్రెసిడెంట్ జో బైడెన్ అసమర్థత వల్లే యుద్ధం వచ్చిందని వాదించారు. కానీ ఎన్నికల్లో గెలిచి, ప్రెసిడెంట్ అయ్యాక మాత్రం ఆయన వైఖరిలో మార్పు కనిపించింది.