మారరా మీరు..: పాకిస్తాన్‌లో పొల్యూషన్.. మన దేశంపై పడి ఏడుస్తున్నారు

పాకిస్తాన్‌లో అతిపెద్ద రెండో నగరమైన లాహోర్‌ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. లాహోర్‌ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. నాలుగు మీటర్ల దూరంలో ఉన్న మనిషి సైతం కంటికి కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణం పొరుగు దేశం ఇండియానే కారణమని ఆ దేశ ప్రజాప్రతినిధి, మంత్రి మర్రియం వ్యాఖ్యానించారు.

లాహోర్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన సురక్షిత పరిమితి కంటే నగర గాలి నాణ్యత 40 రెట్లు ఎక్కువగా ఉంది. స్విస్ గ్రూప్ IQAir  విడుదల చేసిన డేటా ఆధారంగా లాహోర్‌లోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) వారాంతంలో రికార్డు స్థాయిలో ఉంది. పాకిస్తాన్-భారత్ సరిహద్దు ప్రాంతాల్లో 1900కి చేరుకుంది. గాలిలో PM 2.5 లేదా చిన్న రేణువుల సాంద్రత 450కి చేరుకుంది. ఇది ప్రమాదకరమని పంజాబ్ పర్యావరణ పరిరక్షణ విభాగం తెలిపింది.

భారత్ నుంచి గాలి వీస్తోంది..

భారతదేశ నగరాలైన అమృత్‌సర్, చండీగఢ్ నుండి వస్తున్న గాలులు కారణంగానే లాహోర్‌లో కాలుష్యం(AQI) పెరుగుతోందని సీనియర్ మంత్రి మర్రియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు మరియు, పిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమస్యను న్యూఢిల్లీతో కలిసి పరిష్కరించేందుకు విదేశాంగ కార్యాలయానికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చాడు.

పాఠశాలలు మూసివేత

కాలుష్య కోరలు నేపథ్యంలో సోమవారం(నవంబర్ 04) నుండి వారం రోజుల పాటు లాహోర్‌లోని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని పాకిస్తాన్ అధికారులు ఆదేశించారు. అంతేకాదు, లాహోర్‌ ప్రజలు ఫేస్ మాస్క్ ధరించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.