కరాచీలో పుట్టి గోవాలో పెరిగిన వ్యక్తి.. 43 ఏండ్ల తర్వాత భారత పౌరసత్వం

కరాచీలో పుట్టి గోవాలో పెరిగిన వ్యక్తి.. 43 ఏండ్ల తర్వాత భారత పౌరసత్వం
  • ఏళ్లుగా సిటిజన్ షిప్ కోసం ప్రయత్నం

పనాజీ: పాక్ లో జన్మించి గోవాలో నివసిస్తున్న వ్యక్తికి 43 ఏండ్ల తర్వాత భారత పౌరసత్వం లభించింది. ఈ మేరకు మంగళవారం గోవా సీఎం ప్రమోద్ సావంత్ పౌరసత్వ (సవరణ) చట్టం ప్రకారం ఆయనకు ఇండియన్ సిటిజన్ షిప్ అందజేశారు. షేన్ సెబాస్టియన్ పెరీరా అనే వ్యక్తి పూర్వీకులు నార్త్ గోవా అంజునాలోని డెమెల్లో వాడోకు చెందిన వారు. అతడి తల్లిదండ్రులు కరాచీకి వలస వెళ్లి స్థిరపడ్డారు. షేన్ సెబాస్టియన్ పెరీరా కరాచీలోనే ఆగస్టు1981లో జన్మించారు.

ఆయన పుట్టిన నాలుగు నెలల తర్వాత వారి కుటుంబం గోవా డెమెల్లో వాడోకు తిరిగి వచ్చింది. ఆయన అక్కడే స్కూల్ విద్యను పూర్తి చేశారు. అనంతరం 2012లో భారతీయురాలు మరియా గ్లోరియా ఫెర్నాండెజ్‌‌‌‌ను పెళ్లి చేసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నారు. చివరకు 43 ఏండ్ల తర్వాత పౌరసత్వాన్ని అందుకున్నారు.

గోవాకు చెందిన జోసెఫ్​ ప్రాన్సిస్ పెరీరా అనే పాక్ పౌరుడికి ఈ ఏడాది ఆగస్టులో భారత పౌరసత్వం లభించింది. ఆయన​ స్ఫూర్తితోనే షేన్ సెబాస్టియన్ పెరీరా పట్టు వదలకుండా ప్రయత్నించి సిటిజన్ షిప్​ను దక్కించుకున్నారు. గోవా నుంచే పౌరసత్వాన్ని దక్కించుకున్న రెండో వ్యక్తిగా నిలిచారు.