ఛాంపియన్స్ ట్రోఫీ.. ఛాంపియన్స్ ట్రోఫీ.. దాయాది దేశంలో ఈ టోర్నీ గోల తప్ప మరొకటి కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం.. టీమిండియా ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లకపోతే దాయాది దేశానికి దాదాపు రూ.1,000 కోట్ల నష్టం. అందువల్ల భారత జట్టును ఎలాగైనా తమ దేశానికి రప్పించాలని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కుటిల యత్నాలు చేస్తోంది. బీసీసీఐ సూచిస్తున్న హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు అంగీకరించపోగా.. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా చర్చించి పరిష్కరించుకుందామని చెప్తోంది.
ఇలాంటి పరిణామాల నడుమ పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తమ దేశానికి రావాలంటూ భారత జట్టుకు ఆహ్వానం పంపాడు. పట్టుదలకు పోకుండా తమ దేశాన్ని సందర్శించాలని అభ్యర్థించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో పాక్ జట్టుకు భారత దేశంలో అద్భుతమైన ఆతిథ్యం, భద్రత అందిందని.. తమ దేశానికి వస్తే, అంతకుమించిన ఆతిథ్యం అందిస్తామని హామీ ఇచ్చాడు.
రోహిత్, కోహ్లీ అంటే పడి చస్తారు..
"పాక్ అభిమానులకు భారత ఆటగాళ్ల అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీని ఆదరించే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది మేం వన్డే ప్రపంచకప్ కోసం భారతదేశానికి వెళ్లినప్పుడు అతిథి మర్యాదల్లో, భద్రతలో ఎక్కడా రాజీ పడలేదు. మేము కూడా భారత్.. పాకిస్తాన్ వచ్చి ఇక్కడ ఆడాలని కోరుకుంటున్నాం. వారు ఛాంపియన్స్ ట్రోఫీకి వస్తున్నారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. భారత క్రికెటర్లు ఇక్కడికి వస్తే, వారికి అపూర్వమైన స్వాగతం లభిస్తుంది.." అని రిజ్వాన్ విలేకరుల సమావేశంలో అన్నారు.
Also Read : బ్యాటర్లకు కఠిన సవాల్
"Pakistan fans love Indian players; we received love in India during the 2023 World Cup. I'm unsure if they're coming for the Champions Trophy, but one thing is certain - if they come, they'll receive an awesome welcome here." pic.twitter.com/oFfaP4jbzw
— ٰImran Siddique (@imransiddique89) October 29, 2024
పీసీబీ చైర్మన్ మాటలు మరోలా..
ఈ విషయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటలు మరోలా ఉన్నాయి. పాకిస్థాన్ గర్వం, గౌరవమే తమకు ముఖ్యమన్న నఖ్వీ.. ఛాంపియన్స్ ట్రోఫీ తమ గడ్డపైనే జరుగుతుందని కుండబద్ధలు కొట్టాడు. బీసీసీఐ సూచిస్తున్న హైబ్రిడ్ మోడల్‌కు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేశాడు. భారత్‌కు ఏవైనా సమస్యలు ఉంటే, నేరుగా చర్చించి పరిష్కరించుకుందామని తెలిపాడు. క్రీడలకు రాజకీయాలు ముడిపెట్టొద్దని.. వాటిని వేరుగా చూడాలని సూచించాడు. ఈ విషయంలో పాకిస్థాన్ వైఖరిని ఎవరూ సవాలు చేయలేరని అన్నాడు.
ఈ వారంలోనే షెడ్యూల్..!
పీసీబీ, బీసీసీఐ.. ఇరు బోర్డులు తమ స్టాండ్ పై నిలబడటంతో టోర్నీ షెడ్యూల్ ఆలస్యమవుతోంది. సాధారణంగా, ఏదేని టోర్నీ ప్రారంభానికి 100 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈసారి టీమిండియా పాక్ వెళ్లేందుకు నిరాకరించడంతో ఆలస్యమవుతోంది. నివేదికల ప్రకారం, ఐసీసీ ఆతిథ్య పాకిస్తాన్ సహా మిగిలిన పాల్గొనే జట్లతో షెడ్యూల్ గురించి చర్చలు జరుపుతోంది. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల కావొచ్చని సమాచారం. షెడ్యూల్ విడుదలైతే తప్ప ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా..! లేదా అనే దానిపై స్పష్టత లేదు.