Champions Trophy: భారత్ చేతిలో అవమానకర ఓటమి.. పాక్ కోచ్, సహాయక సిబ్బందిపై వేటు!

Champions Trophy: భారత్ చేతిలో అవమానకర ఓటమి.. పాక్ కోచ్, సహాయక సిబ్బందిపై వేటు!

ఛాంపియన్స్ ట్రోఫీ(2025)లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు దాదాపు ఇంటిదారి పట్టినట్లే. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాక్, ఆదివారం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. గ్రూప్ దశలో వారింకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. అది నామమాత్రమే. సోమవారం బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే, పాక్ అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంటుంది.

ఈ పేలవమైన ప్రదర్శనలను ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ(PCB) జీర్ణించుకోలేకపోతోంది. జట్టుకు ఓటములు కొత్తేమీ కానప్పటికీ, భారత్ చేతిలో అవమానకర ఓటమిని తట్టుకోలేకపోతోంది. టీమిండియా 4 వికెట్లు కోల్పోయిందన్న పేరు తప్ప.. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. ఎక్కడా పాక్ పైచేయి సాధించింది లేదు. ఇదే ఆ దేశ బోర్డుకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ కోపం తగ్గించుకునేందుకు.. వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పీసీబీ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్(Aaqib Javed) బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. 

"ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపై వ్యతిరేకత ఉంది. జట్టుకు ప్రత్యేక హెడ్ కోచ్‌లు (వన్డే, టీ20, టెస్టులు) ఉండాలా..! లేదా..! అనే దానిపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మెగా టోర్నీలో పేలవమైన ప్రదర్శన తర్వాత ప్రస్తుత సహాయక సిబ్బందిని పూర్తి స్థాయిలో చేస్తారని ఖచ్చితంగా చెప్పగలం. కాకపోతే గత ఏడాది కాలంలో కోచ్‌లు, సెలెక్టర్లను మారుస్తున్న విధానం.. కొత్త వారిని ఎంపిక చేయడానికి ఒక సవాలుగా మారుతోంది.." అని పీసీబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. 

పీసీబీ చైర్మన్‌గా ఎంపికైన మోహ్సిన్ నఖ్వీ.. గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేయగానే ఆకిబ్‌ను తీసుకొచ్చి వైట్ బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆసీస్ మాజీ స్టార్ జాసన్ గిల్లిస్పీ కూడా తప్పుకోవడంతో.. తాత్కాలిక రెడ్ బాల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించమని కోరారు.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్తాన్ మార్చి 16 నుండి ఏప్రిల్ 5 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఆ సమయానికి శాశ్వత కోచ్‌ను ఖరారు చేయాలన్నది బోర్డు ఆలోచన.