మీ పదవులు వద్దు: పాకిస్థాన్ క్రికెట్‌కు రాజీనామా చేసిన మాజీ కోచ్, డైరెక్టర్

మీ పదవులు వద్దు: పాకిస్థాన్ క్రికెట్‌కు రాజీనామా చేసిన మాజీ కోచ్, డైరెక్టర్

పాకిస్థాన్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. వరల్డ్ కప్ ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ లో భారీ మార్పులు చేయగా.. తాజాగా కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్‌ లు పాకిస్థాన్ క్రికెట్‌ నుంచి వైదొలిగారు. గురువారం (జనవరి 18) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. నవంబర్ 2023లో భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత వారికి నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో విధులు కేటాయించబడ్డాయి. తాజాగా వీరు తమ స్థానాలకు రాజీనామా చేశారు.

2016 నుంచి 2019 మధ్య పాకిస్థాన్‌ జట్టుకు మిక్కీ ఆర్థర్ కోచ్ గా పని చేశాడు. ఏప్రిల్ 2023లో పాక్ జట్టులో డైరెక్టర్‌గా చేరారు. ఆర్థర్ 2016 నుండి 2019 వరకు పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఇతను కోచ్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆర్థర్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.

57 ఏళ్ల బ్రాడ్‌బర్న్ 1990 నుండి 2001 వరకు 18 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ తరపున మ్యాచ్ లాడాడు. NCAలో హై-పెర్ఫార్మెన్స్ కోచింగ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు వరకు 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ మెన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ పుట్టిక్ ఏప్రిల్ 2023 నుండి పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.