జొహనెస్‌బర్గ్ : బ్యాటింగ్‌లో సైమ్ అయూబ్ (101), మహ్మద్ రిజ్వాన్ (53), బాబర్ ఆజమ్ (52) చెలరేగడంతో.. ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్ 36 రన్స్ (డక్‌వర్త్ లూయిస్) తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 47 ఓవర్లలో 308/9 స్కోరు చేసింది. సల్మాన్ ఆగా (48), తయ్యబ్ తాహిర్ (28) ఫర్వాలేదనిపించారు.
సఫారీ బౌలర్లలో రబాడ మూడు , యాన్సెన్, జార్న్ ఫోర్చుయిన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత సౌతాఫ్రికా 42 ఓవర్లలో 271 రన్స్‌కే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (81) టాప్ స్కోరర్. కోర్బిన్ బోష్ (40 నాటౌట్), డసెన్ (35), టోనీ డి జోర్జి (26) మోస్తరుగా ఆడారు. సుఫియాన్ ముకీమ్ 4, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సైమ్ అయూబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.