సైఫర్ కేసులో పాక్ మాజీ ప్రధానికి కోర్టు క్లీన్ చిట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసు నుంచి ఊరట లభించింది. సైఫర్ కేసులో ఆయన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌తో మాజీ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్ దౌత్య పరమైన రహస్యాలు ఏమీ తన దగ్గర ఉంచుకోలేదని.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కూడా ఏమి లేవని హైకోర్టు పేర్కొంది.

ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశాడని ఆరోపణలతో ఆయనపై సైఫర్ కేసు నమోదు చేశారు. 2023 మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుండి వైదొలిగారు. 2023 ఆగస్ట్ 5న ఆయన్ని అరెస్ట్ చేశారు.