వరల్డ్ కప్ లో పాక్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసింది. చివరి మ్యాచ్ వరకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్న పాక్ నిన్న ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో ఈ మెగా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో తమ చివరి మ్యాచ్ ఆడిన పాక్ నేడు (నవంబర్ 12) స్వదేశానికి పయనమైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారతదేశం నుండి వెళ్లబోయే పాక్ ప్రయాణికుల వివరాలను తెలియజేసింది.
ఈ వివరాల ప్రకారం.. పాక్ జట్టు రెండు విడతలుగా స్వదేశానికి చేరనుంది. 11 మంది సభ్యులతో కూడిన మొదటి బ్యాచ్ నవంబర్ 12 ఆదివారం ఉదయం 8:55 గంటలకు, రెండవ బృందం అదే రోజు రాత్రి 08:20 గంటలకు కోల్‌కతా నుండి బయలుదేరుతాయి. వీరు ముందుగా దుబాయ్‌లో దిగి, నవంబర్ 13న పాకిస్థాన్‌లోని వారి సంబంధిత నగరాలకు చేరుకుంటుంది. అయితే పాక్ పేసర్ హసన్ అలీ మాత్రం నవంబర్ 22 వరకు భారత్ లోనే ఉండనున్నాడు.
అలీ భార్య సమియా అర్జూ భారతదేశానికి చెందినది. సమియా కుటుంబం హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది. దీంతో హసన్ అలీ కొన్ని రోజులు భారత్ లోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. మరో పది రోజుల తర్వాత ఈ పాక్ పేసర్ స్వదేశానికి పయనమవుతాడు. హసన్ అలీ సమియా అర్జూను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొత్తం 9 మ్యాచ్ ల్లో 4 విజయాలను సాధించింది. ఈ నాలుగు విజయాల్లో న్యూజిలాండ్ మినహాయిస్తే అన్ని చిన్న జట్లు మీదే గెలిచారు. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంకపై పాక్ ఈ విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో హసన్ అలీ మొత్తం 9 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.