Pakistan Cricket: పాక్ క్రికెటర్లూ మీరు మారరు.. పరుపులేసుకొని క్యాచ్‌లు ప్రాక్టీస్

Pakistan Cricket: పాక్ క్రికెటర్లూ మీరు మారరు.. పరుపులేసుకొని క్యాచ్‌లు ప్రాక్టీస్

అమెరికా చేతిలో ఓడినా.. టీ20 ప్రపంచ‌క‌ప్‌లో గ్రూప్ ద‌శలోనే ఇంటిదారి పట్టినా.. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత చెత్త క్రికెటర్లు కాకపోతే.. మైదానంలో పాత పరుపులేసుకొని వాటిపై పడుతూ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి.. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న యూరప్ దేశాల క్రికెటర్లు సైతం ఇలాంటి పని చేయరు. వీరి ఫీల్డింగ్ విన్యాసాలు నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఆ దేశ మీడియా మరో మెట్టు మెక్కి బయట ప్రపంచానికి చూపెడుతోంది.

టీ20 ప్రపంచ‌క‌ప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం స్వదేశానికి చేరుకున్న బాబ‌ర్ బృందం వారం రోజుల విశ్రాంతి గడిచాక లాహోర్‌లోని గ‌డ్డాఫీ స్టేడియంలోని ప్రాక్టీస్ సెష‌న్స్‌లో పాల్గొంది. అక్కడ కొందరు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌పై శ్రద్ధ పెట్టగా.. మరికొందరు క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో పాక్ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్‌తోపాటు మరో ముగ్గురు ఆట‌గాళ్లు మైదానంలో ఏర్పాటు చేసిన పాత ప‌రుపులపై క్యాచులు ప్రాక్టీస్ చేశారు. బౌండరీ లైన్ వద్దనో.. షాట్ కవర్‌లోనో అద్భుతమైన క్యాచ్ అందుకున్న వీరుల్లా డైవ్ చేస్తూ పాత పరుపులపై పడుతున్నారు. పైగా పోటీ పడుతూ పరుపులపై పడుతుండటం గమనార్హం.

బండబూతులు

పాక్ క్రికెటర్ల ఫీల్డింగ్ విన్యాసాల వీడియోలు నెట్టింట కనిపించగానే.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. కొందరు నవ్వుకునేలా ఫన్నీ కామెంట్లు చేయగా.. మరికొందరు బండబూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. పొరపాటున ఆ మాటలు పాక్ ఆటగాళ్ల చెవిన పడితే, ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత దారుణమైన కామెంట్లు చేశారు.