- జమ్మూలో కాంగ్రెస్ కూటమిదే అధికారం
ఇస్లామాబాద్, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పునరుద్ధరణపై పాకిస్తాన్ ప్రభుత్వం, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ కూటమియే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే ఆలోచనలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉందన్నారు. తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఆర్టికల్ 370 ఇష్యూపై సైలెంట్‌గా ఉందన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఈ అంశం గురించి అసలు ప్రస్తావించలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని మాత్రమే కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.
దేశ వ్యతిరేకులే కాంగ్రెస్‌కు దోస్తులు: బీజేపీ
పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు స్పందించారు. దేశ వ్యతిరేకులతోనే కాంగ్రెస్‌కు దోస్తీ ఉందని తాము ముందునుంచీ చెప్తూ వస్తున్నామన్నారు. ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. ఇండియన్ ఆర్మీ బాలాకోట్ పై వైమానిక దాడులు చేస్తే కాంగ్రెస్ సాక్ష్యాలు అడిగిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్, పాకిస్తాన్ ఆలోచనలు ఒకేలా ఉంటాయని విమర్శించారు.
దేశ ప్రయోజనాలను దెబ్బతీసే వారివైపే కాంగ్రెస్ ఉంటదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్, తమ ఆలోచనలు ఒకేలా ఉన్నాయంటూ పాకిస్తాన్ ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. పాకిస్తాన్ కామెంట్లను కాంగ్రెస్ కనీసం ఖండించలేదన్నారు.