మా ఉనికికి ముప్పు ఏర్పడితే అణు బాంబులేస్తం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్

మా ఉనికికి ముప్పు ఏర్పడితే అణు బాంబులేస్తం.. పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్

పెషావర్: జమ్మూకాశ్మీర్​లోని పహల్గాం​లో ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని పాక్​ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని, భారత్​ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ దేశ సైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని చెప్పారు. భారత సైన్యం ఆ ఏర్పాట్లలోనే ఉండి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. తమపై దాడి జరిగే అవకాశం పొంచి ఉన్న పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని ఖవాజా చెప్పారు. 

భారత్​ దాడి చేసే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు నివేదించగానే పలు నిర్ణయాలు తీసుకున్నామని, బలాబలాలు పెంచుకుని ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని వివరించారు. ‘సైన్యాన్ని బలోపేతం చేసుకున్నం. 

వ్యూహాత్మక నిర్ణయాలు తీసేసుకున్నం. హై అలర్ట్ ప్రకటించాం. మా ఉనికికి భంగం వాటిల్లుతుందనే పరిస్థితిలోనే  అణ్వాయుధాలను ప్రయోగిస్తం. అప్పటి వరకు వాటిని ఉపయోగించబోం’ అని ఖవాజా స్పష్టం చేశారు.