ఇస్లామాబాద్: పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో కొత్త సర్కార్ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. పాక్ నేషనల్ అసెంబ్లీలోని 265 అన్ రిజర్వ్డ్ సీట్లకు గురువారం పోలింగ్ జరిగింది. ఒక సీటులో అభ్యర్థి చనిపోవడంతో పోలింగ్ వాయిదాపడింది. పోలింగ్ జరిగిన 264 సీట్లకు ఫలితాలు శనివారం సాయంత్రానికి 250 సీట్లకు రిజల్ట్స్ వెల్లడయ్యాయి. ఇందులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతిచ్చిన ఇండిపెండెంట్లు 99 సీట్లు గెలుచుకున్నారు. షరీఫ్ పార్టీ పీఎంఎల్–ఎన్ కు 71, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీకి 53, మిగతా 27 సీట్లను ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి.
ఎవరి సర్కార్ ఏర్పాటవుతుందో..
పాక్ సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ నిషేధం నేపథ్యంలో పీటీఐ పార్టీ తన గుర్తు బ్యాట్‌పై ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. దీంతో ఆ పార్టీ నిలబెట్టిన ఇండిపెండెంట్లను పార్టీగా పరిగణించే అవకాశం లేదు. పాక్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం.. వీరంతా రిజల్ట్స్ నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల్లోగా ఏదైనా పార్టీలో చేరాలి. లేదంటే మద్దతు ఇవ్వాలి.
అందరూ కలిసి సమూహంగా ఏర్పడి ప్రతిపక్షంగా అయినా ఉండొచ్చు. ఇలా చేస్తేనే వీరికి రిజర్వ్ సీట్లలో వాటా పొందే అవకాశం ఉంటుంది. పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నందున వీరి భవితవ్యం ఏమిటనేది తేలడంలేదు. ఇక పీఎంఎల్–ఎన్ పార్టీకే అత్యధిక సీట్లు వచ్చినందున పీపీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా, ఆర్మీ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి నమోదైన12 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.