తోషఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసు (సైఫర్ కేసు)లో ఇమ్రాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే పాకిస్థాన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. అంతేకాకుండా మరో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా విధించింది. ఆ జంట సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.
ఇంతకీ కేసు ఎంటీ?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి అయితే వాటిని తోషాఖానాలో జమ చేయాలి. తోష్‌ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. రాజకీయ నేతలకు, అధికారులకు వచ్చే బహుమతులను ఇందులో ఉంచుతారు. అయితే బహుమతుల విలువ రూ. 30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఖరీదు అయితే చట్టం ప్రకారం తోష్‌ఖానాలో ఉంచాలి.
ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్న టైమ్ లో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించకుండా రూ.38 లక్షల రోలెక్స్ గడియారాన్ని కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అదే విధంగా రూ.15 లక్షలు విలువ చేసే మరో రోలెక్స్ గడియారాన్ని రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి , ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది.
కానుకల్ని మొత్తం రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో తెలిపారు ఇమ్రాన్. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆదాయం వివరాల్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్‌పై ఈసీ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తర్వాత కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ కోర్టు ఏకంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది.