Champions Trophy: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవాలి.. పాక్ అభిమాని శాపనార్ధాలు

Champions Trophy: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవాలి.. పాక్ అభిమాని శాపనార్ధాలు

ఇండియా vs పాకిస్తాన్.. ఒకప్పుడు ఈ దాయాది జట్లు తలపడుతున్నాయంటే.. మ్యాచ్ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేవి. రెచ్చకొట్టే మాటలు, చంపేసేలా కళ్లు ఉరిమి చూడటాలు కామన్‌గా కనిపించేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఒకప్పటి దృశ్యాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇరు జట్ల ప్లేయర్లు స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. నవ్వుతూ సెల్ఫీలు దిగుతున్నారు. ఈ స్నేహపూర్వక వాతావరణమే ఇరు దేశాల అభిమానులకు నచ్చడం లేదు. ప్రత్యర్థి జట్టు పట్ల ఫైర్ ఉంటేనే.. మ్యాచ్‌లో సీరియస్‌నెస్ ఉంటుందనేది అభిమానుల వాదన.స్నేహాంగా మాట్లాడితే, ఎదుటి వారిని ఓడించాలనే కసి తగ్గిపోతుందట. 

ALSO READ | ICC T20I rankings: ఒక్క సిరీస్‌తోనే సంచలనం.. టాప్-2 లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి

తాజాగా, ఓ పాక్ అభిమాని ఈ విషయంలో ఆ జట్టు ఆటగాళ్లకు హెచ్చరికలు పంపాడు. భారత ఆటగాళ్లను కౌగిలించుకోవడాలు, నవ్వుతూ పలకరించడాలు గట్రా చేయొద్దని సూచించాడు. అలా చేసి గౌరవం తగ్గించుకోవద్దని హితవు పలికాడు. అంతేకాదు, పాక్ వెళ్లేందుకు ఇష్టపడని భారత జట్టు.. మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుండి ఎలిమినేట్ కావాలని శాపనార్ధాలు పెట్టాడు. 

బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు మన దేశానికి రాకుండా భారత ఆటగాళ్లు పెద్ద తప్పు చేశారు. అటువంటి వారితో స్నేహం మనకొద్దు. వారిని కౌగిలించుకోవటాలు, చూసి నవ్వటం వంటివి చేయొద్దని నాదేశ జట్టుకు చెప్తున్నాను. అలా చేసి వారి గౌరవం ప్రమాదంలో పడే విధంగా చేసుకోవద్దని కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌ను కోరుతున్నాను. భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ బాగుంటుంది. ఇరు దేశాల అభిమానులు తమ జట్టు గెలవాలని కోరుకుంటారు. కానీ, ఒక్క విషయం. భారత జట్టు మనదేశానికి వచ్చి ఆడనందున, వారు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ కావాలని మేము కోరుకుంటున్నాం.." అని ఓ పాక్ అభిమాని శాపనార్ధాలు పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హైబ్రిడ్ మోడల్.. 

భద్రతా కారణాలను చూపుతూ, ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో.. బీసీసీఐ భారత జట్టును పాకిస్తాన్‌ పంపే సాహసం చేయలేదు. ఈ విషయంపై బీసీసీఐ వెనక్కి తగ్గకపోవడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) చివరకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించింది. భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో మెన్ ఇన్ బ్లూ ఫైనల్‌కు చేరుకుంటే.. దుబాయ్‌లోనే తుది పోరు జరగనుంది.

ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్‌ ఫిబ్రవరి 23 (ఆదివారం) జరగనుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(దుబాయ్) ఆతిథ్యమివ్వనుంది.