వచ్చే నెల ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్థానే ఫేవరెట్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వరుస ఓటములు పాక్ ఆటగాళ్లలో కసి పెంచాయని.. సొంతగడ్డపై వారిని ఓడించటం పర్యాటక జట్లకు అంత సులువైన పని కాదన్నారు. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలో పాక్ బలంగా కనిపిస్తోందని అన్నారు.
ఒక భారత క్రికెటర్‌గా, ఒక అభిమానిగా తమ జట్టు గెలవాలని కోరుకోవడం కామన్ అన్న గవాస్కర్.. ఏడాది క్రితం సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న రోహిత్ సేన టైటిల్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదని అన్నారు.
"ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ అనే ట్యాగ్‌ని స్వదేశీ జట్టు పాకిస్తాన్‌కు ఇవ్వాలి. ఎందుకంటే స్వంత పిచ్ లపై వారిని ఓడించడం ఏ జట్టును అంత సులభం కాదు. వన్డే ప్రపంచ కప్ లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ అంతకు ముందు వారి ప్రదర్శనలు చూడండి. వరుసగా పది మ్యాచ్‌లను గెలుచుకున్నారు. అందుకే, రాబోయే టోర్నీలో పాకిస్థాన్ ఫేవరెట్ అని నేను భావిస్తున్నాను.." అని గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.
Also Read : ఇక ఐపీఎల్ ఆడుకోవాల్సిందే
గవాస్కర్ మాటలను మాజీ భారత ఆల్-రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అంగీకరించారు. దుబాయ్‌లో సీమ్ పరిస్థితులు పాక్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు.
ఇదిలావుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ పోరు కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. వెన్నునొప్పి గాయం కారణంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ నుంచి వైదొలిగిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అలాగే, వన్డే ప్రపంచ కప్ అనంతరం జట్టుకు దూరమైన మరో భారత పేసర్ మహ్మద్ షమీ జట్టులో చోటు సంపాదించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.
ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.