Gold Reserves: పాకిస్థాన్‌కి మరో జాక్‌పాట్.. బయటపడ్డ రాగి, బంగారం నిల్వలు, కానీ..

Gold Reserves: పాకిస్థాన్‌కి మరో జాక్‌పాట్.. బయటపడ్డ రాగి, బంగారం నిల్వలు, కానీ..

Pakistan Gold Reserves: ఎప్పుడూ పక్కదేశాలను ఎలా నాశనం చేయాలా అనే ప్లాన్ చేస్తూ ఆర్థికంగా కుదేలైన దాయాది పాకిస్థాన్ కి మరోసారి అదృష్టం పట్టింది. ఇటీవలి కాలంలో వరుసగా పాక్ బంగారం నిక్షేపాలను కనుగొంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని మరో ప్రాంతంలో రాగి, బంగారం నిక్షేపాలను గుర్తించినట్లు ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించటం గమనార్హం. 

తాజాగా బలూచిస్థాన్‍‌లోని చగాయ్ జిల్లాలో అధికారులు ఈ నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి దేశానికి అంతర్జాతీయ సంస్థలపై నిధుల కోసం ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇది అప్పుల ఊబిలో కూరుకుని ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. దీనికి ముందు కొన్ని నెలల కిందట పాక్ సింధు నదిలో పెద్ద మొత్తంలో బంగారు నిక్షేపాలను కూడా కనుగొంది. పంజాబ్ ప్రావిన్సులోని అటోక్ జిల్లాలో సింధు నది లోయలో ఉన్న వాటి విలువ దాదాపు రూ.80వేల కోట్లుగా ఉంటుందని అప్పట్లో బయటకు వచ్చింది. 

Also Read:-48 గంటల్లో గ్రాము రేటు రూ.500 అప్..

ప్రస్తుతం భారీగా రాగి, బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు పాకిస్థాన్ నేషనల్ రిసోర్స్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే ఇవి బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉండటం పాక్ ముందు పెద్ద ఛాలెంజ్‌గా నిలవొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడచిన 18 నెలల కాలంలో పాక్ గుర్తించిన 16 ఖనిజాల స్థలాల్లో ఇది కూడా నిలిచింది. వీటి విలువ అనేక ట్రిలియన్ డాలర్ల విలువ ఉంటుందని ప్రధాని పేర్కొ్న్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణాలకు ఇక పాక్ చెల్లుచీటీ పాడుతుందని ఆయన అన్నారు.   

ప్రస్తుతం బలూచిస్థాన్ ప్రాంతంలో బొగ్గు, క్రోమైట్, మార్బుల్, రాగి వంటి ఖనిజాలకు నిలయంగా మారింది. అయితే దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, భద్రతా పరిస్థితులు, మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల పూర్తి స్థాయి అన్వేషణ, అభివృద్ధి నిరోధించబడ్డాయి. నిక్షేపాలను కనుగొనటం ప్రపంచ మైనింగ్ కంపెనీల నుంచి ఈ ప్రాంతంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రధానంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తున్న చాలా దేశాల కన్ను ఇక్కడి మైనింగ్ వ్యాపార కార్యకలాపాలపై పడుతోంది.