ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేదం విధించిన పాక్‌ ప్రభుత్వం

ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేదం విధించిన పాక్‌ ప్రభుత్వం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెహ్రీక్‌- ఈ -ఇన్సాఫ్‌ (PTI) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం పాకిస్థాన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇమ్రాన్‌ పార్టీ పీటీఐపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార మంత్రి అత్తావుల్లా తరార్‌ సోమవారం ప్రకటించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పీటీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. 

పీటీఐని నిషేధించడానికి విదేశీ నిధుల కేసు, మే 9 అల్లర్లు, సైఫర్‌ ఎపిసోడ్‌ సహా పలు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రిజర్వ్‌డ్‌ సీట్ల విషయంలో పీటీఐకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కి ఇటీవల సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. అంతలోనే పార్టీని నిషేధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. 71 ఏళ్ల ఇమ్రాన్‌ ఖాన్‌ 1996లో పీటీఐని స్థాపించారు. 2018లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

అవిశ్వాస తీర్మానం ఓడిపోవడంతో ఏప్రిల్‌ 2022లో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధానికి పలు కేసుల్లో జైలు శిక్ష ఖరారు కావడంతో.. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.