పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి రమీజ్ రజాను ఆ దేశ ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోటిఫికేషన్ జారీ చేశారు. పాక్ కేబినెట్ ఆమోదిస్తే అమల్లోకి రానుంది. ఇటీవలే పాక్ ఇంగ్లాండ్ చేతిలో 3-0తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో అతనిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రజా స్థానంలో నజమ్ సేథీ అధ్యక్షుడిగా 14 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు నెలలు పాటు సేథీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. రద్దు చేసిన పీసీబీ రాజ్యాంగాన్ని మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కొత్త కమిటీలో షాహిద్ అఫ్రిది, హరూన్ రషీద్, మహిళా క్రికెటర్ సనా మిర్ కూడా స్థానాలు దక్కించుకున్నారు.
రమీజ్ రజా 15 నెలలుగా పీసీబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో రమీజ్ రజాను ఛైర్మన్గా నియమించింది. ఇషాన్ మణీ నుంచి రజా చైర్మన్గా బాధ్యతలను స్వీకరించాడు. కొత్తగా చైర్మన్గా నియమితులైన సేథీ కూడా 2013 నుంచి -18 వరకు పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా పనిచేశారు.