
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనతో పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత్.. దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. 1960 సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతు ఎండబెడుతున్న భారత్.. అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ కూడా మూసివేసింది. 48 గంటల్లో పాక్ పౌరులు భారత్ విడిచిపోవాలని ఆదేశించింది. అలాగే.. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియాలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌ను నిలిపివేయబడింది. ‘‘చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను ఇండియాలో నిలిపివేయబడింది’’ అని ఎక్స్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వ సూచన మేరకు పాక్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌ను నిలిపి వేసినట్లు తెలుస్తోంది.
కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది.
కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారిపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపి చంపడంతో దేశ ప్రజలు మండిపోతున్నారు. ఈ క్రమంలో పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అడుగడుగునా నిశితంగా పరిశీలిస్తు్న్నాయి.