భారత్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న పాకిస్తాన్

భారత్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న పాకిస్తాన్
  • సైన్యం సిద్ధం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటం
  • వాఘా బార్డర్ మూసేస్తున్నం, ఎయిర్ లైన్స్, సర్వీసులు క్లోజ్
  • ఇక్కడున్న ఇండియన్స్ 48 గంటల్లో వెళ్లిపోవాలె
  • ఆ దేశంతో  ఎగుమతులు, దిగుమతులు  రద్దు
  • సింధు జలాలపై ఐక్యరాజ్యసమితిలో సవాల్ చేస్తం
  • పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ కీలక నిర్ణయం 

ఇస్లామాబాద్: భారత్తో పూర్తిగా తెగదెంపులు  చేసుకుంటున్నట్టు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో  పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని ఇండియాకు స్పష్టంగా చెప్పినా తమ దేశంపై చర్యలకు సిద్దమవుతోందని తెలిపింది. తాము కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు  సైన్యం సిద్ధంగా ఉందని తెలిపింది. 

తక్షణం సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. వాఘాబార్డర్ మూసి వేస్తున్నట్టు తెలిపారు. వాణిజ్యపరమైన ఎగుమతులు, దిగుమతులు ఈ రెండు దేశాల మధ్య ఇకపై ఉండబోవని స్పష్టం చేసింది. పాకిస్తాన్ లో ఉంటున్న భారతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది.యాత్రికులు, టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు వెంటనే వెళ్లి పోవాలని తెలిపింది.  

సింధూ నదిలో నీటి వాటాపై తాము ఐక్యరాజ్య సమితిలో సవాలు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ పక్షాన ఐదుగురు సభ్యులతో కమిటీ వేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ కోర్టులో ఎదుర్కోవాలని నిర్ణయించింది. బీఎల్ఏ ఉగ్రవాద సంస్థ కీలక నాయకులు భారత్ లోనే ఉన్నారని, కానీ ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ ను నిందించడం ఫ్యాషన్ అయిపోయిందని ఫైర్ అయ్యింది. 

బీఎల్ఏ ఉగ్రవాదులు తమ వారిపై దాడి చేశారని తెలిపింది. ఉగ్రవాదులు భారత్ భూభాగంలో ఉండటం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని కమిటీ తెలిపింది.