Pak vs Ban 2024: రిజ్వాన్‌కు తప్పని నిరాశ.. డబుల్ సెంచరీ కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్

Pak vs Ban 2024: రిజ్వాన్‌కు తప్పని నిరాశ.. డబుల్ సెంచరీ కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ పై జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఊహించని షాక్ తగిలింది. నాలుగు వికెట్లు పడిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రిజ్వాన్‌.. తొలి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేసి అజేయంగా నిలిచాడు.  రెండో రోజు అదే జోరును కొనసాగించి హాఫ్ సెంచరీ.. సెంచరీ.. 150 పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. ఇతని ఫామ్ చూస్తుంటే ఈజీగా డబుల్ సెంచరీ మార్క్ అందుకునేలా కనిపించాడు. అయితే వ్యక్తిగత స్కోర్ 171 పరుగుల వద్ద ఉన్నప్పుడు పాక్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 

అప్పటికే పాకిస్థాన్ 6 వికెట్లకు 448 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరో సెషన్ మిగిలి ఉంది. ఈ దశలో కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ అందుకోవాలని ఆశించిన రిజ్వాన్‌కు నిరాశ తప్పలేదు. మరో నాలుగు లేదా ఐదు ఓవర్లు పాకిస్థాన్ బ్యాటింగ్ చేసి ఉన్నా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ డబుల్ సెంచరీ ఫిగర్ మార్క్ అందుకునేవాడు. అయితే వ్యక్తిగత రికార్డ్స్ కన్నా మ్యాచ్ గెలుపే లక్ష్యంగా భావించి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. తొలి రోజు వర్షం పడడం.. ఆట మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పాక్ డిక్లేర్ ఇవ్వక తప్పలేదు. 

ఈ మ్యాచ్ లో రిజ్వాన్‌ 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 171 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రిజ్వాన్‌ తో పాటు సౌద్ షకీల్ (141) భారీ శతకం బాదాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.