
- ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
- పాకిస్తాన్‌కు ఇండియా చురకలు
- ట్రైన్ హైజాక్ వెనుక ఇండియా ఉందన్న పాకిస్తాన్
న్యూఢిల్లీ: టెర్రరిస్టులకు స్వర్గధామం ఏ దేశమో.. ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్తాన్‌కు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చురకలు అంటించింది. టెర్రరిజం ఎక్కడ పుట్టిందో కూడా అందరికీ తెలుసని తెలిపింది.
బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ వెనుక ఇండియా హస్తం ఉందన్న పాకిస్తాన్ కామెంట్లపై ఇండియా ఘాటుగా స్పందించింది. బలూచిస్తాన్ మిలిటెంట్లను ఇండియా రెచ్చగొట్టిందన్న పాక్ పిచ్చికూతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని పాక్‌కు సూచించింది. పొరుగుదేశాల్లో అస్థిరతకు ఇండియా ప్లాన్ చేస్తున్నదన్న పాకిస్తాన్ కామెంట్లను మనోళ్లు తీవ్రంగా ఖండించారు. బలూచిస్తాన్‌లో కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్నదని ఇండియా గుర్తు చేసింది. పరిస్థితిని చక్కదిద్దడం చేతగాకనే పాకిస్థాన్ ఇలాంటి నిరాధార ఆరోపణలు
చేస్తున్నదని ఇండియా మండిపడింది.
టెర్రరిజాన్ని ఇండియా పోషిస్తున్నది: పాకిస్తాన్
టెర్రరిజాన్ని ఇండియా పెంచిపోషిస్తున్నదని, బలూచిస్తాన్ ట్రైన్ హైజాన్కు ఇండియా కారణమని పాకిస్తాన్విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ గురువారం మీడియాకు వివరించాడు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇండియా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు.
ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతున్నదని విమర్శించాడు. ట్రైన్ హైజాక్‌కు ఇండియా పరోక్షంగా సహకరించిందని ఆరోపించాడు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి ఇండియా సహాయం చేస్తున్నదని తెలిపాడు. గత కొన్నేండ్లుగా ఇది కొనసాగుతున్నదని చెప్పాడు. బీఎల్ఏకి అనుకూలంగా ఇండియా మీడియా ఎన్నో కథనాలు ప్రసారం చేసిందని తెలిపాడు.
అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తూనే ఉందని ఆరోపించాడు. బలూచిస్తాన్ కు ఇండియా పరోక్షంగా హెల్ప్ చేస్తున్నదన్న తమ వాదనలో ఏమాత్రం మార్పులేదన్నాడు.