36 గంటల్లో పాక్పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం

36 గంటల్లో పాక్పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం

పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావులా తరార్ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇండియా పాక్పై 24 నుంచి 36 గంటల్లో యుద్ధం చేయబోతోందని, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై దాడి చేయబోతోందని పాకిస్తాన్కు విశ్వసనీయ సమాచారం ఉందని పాక్ మంత్రి అత్తావులా తరార్ తన ‘ఎక్స్’ వేదికగా వీడియో విడుదల చేశారు.

జమ్మూకాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను, వారి వెనక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘‘టార్గెట్లు, టైమ్ మీరే డిసైడ్ చేయండి. అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నదీ మీ ఇష్టం. ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఉగ్రమూకలపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి” అని త్రివిధ దళాల అధిపతులకు ఆయన స్పష్టం చేశారు.

భారత సైన్యానికి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాక్లో.. మరీ ముఖ్యంగా పాక్ ఆర్మీలో యుద్ధ భయం మొదలైంది. ఇండియా ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాక్ వణికిపోతోంది. పాక్ సైన్యంలో సైనికుల రాజీనామాలు ఆ దేశాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇండియా యుద్ధానికి సన్నద్ధమవుతోందని వార్తలు వచ్చిన 72 గంటల్లోనే.. 14వందల 50 మంది పాక్ సైనికులు రాజీనామాలు చేసి పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పారు. ఇందులో.. 250 మంది సైన్యంలో పలు కీలక స్థానాల్లో ఉన్నవారు కూడా ఉన్నారంటే.. పాకిస్తాన్ యుద్ధమంటే ఎంతలా భయపడుతుందో చెప్పకనే చెబుతుంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.