ముక్కోణపు సిరీస్.. పాకిస్థాన్‌లో పర్యటించనున్న సౌతాఫ్రికా,న్యూజిలాండ్

ముక్కోణపు సిరీస్.. పాకిస్థాన్‌లో పర్యటించనున్న సౌతాఫ్రికా,న్యూజిలాండ్

వన్డేల్లో ముక్కోణపు సిరీస్ చాలా సంవత్సరాల తర్వాత జరగనుంది. టీ20 క్రికెట్ ఎక్కువైన తర్వాత వన్డేల పైనే అభిమానులు ఆసక్తి చూపించడం మానేశారు. దీంతో ట్రై సిరీస్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ ట్రయాంగిల్ సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మళ్ళీ శ్రీకారం చుట్టింది. పాక్ వేదికగా 2025లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ముక్కోణపు సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరిలో ఈ సిరీస్ జరగనుంది. ఈ ముక్కోణపు సిరీస్ కు షెడ్యూల్ కూడా ప్రకటించారు. మొత్తం నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లపై ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 14 న ఫైనల్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పాక్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. 

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. 2017 తర్వాత మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించనున్నారు. పాక్ క్రికెట్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ఛైర్మన్ మిస్టర్ లాసన్ నైడూ,  న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఛైర్మన్ మిస్టర్ రోజర్ ట్వోస్‌ కలిసి మార్చి 15న చర్చలు జరిపిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు ట్రై-సిరీస్‌ను ప్రతిపాదించింది. పాకిస్థాన్ చివరిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ముక్కోణపు సిరీస్‌లో ఆడింది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్‌లు ఆడాయి.

పాకిస్థాన్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డే ముక్కోణపు సిరీస్:

ఫిబ్రవరి 8: ముల్తాన్‌లో పాకిస్థాన్ v న్యూజిలాండ్

ఫిబ్రవరి 10: ముల్తాన్‌లో న్యూజిలాండ్ v సౌతాఫ్రికా

ఫిబ్రవరి 12: ముల్తాన్‌లో పాకిస్థాన్ v సౌతాఫ్రికా

ఫిబ్రవరి 14: ముల్తాన్‌లో ఫైనల్