Pakistan Bumrah: పాకిస్థానీ బుమ్రా.. అచ్చుగుద్దినట్టు బంతులేస్తున్నాడు

Pakistan Bumrah: పాకిస్థానీ బుమ్రా.. అచ్చుగుద్దినట్టు బంతులేస్తున్నాడు

పాకిస్థాన్‌కు చెందిన ఓ బుడతడు తన సొంత దేశ బౌలర్లతో పనవ్వదని అని తెలుసుకొని భారత స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాను అనుకరించడం మొదలెట్టాడు. అచ్చం బూమ్ బూమ్ బుమ్రా విసిరినట్లే వైవిధ్యంగా బంతులేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బుమ్రా విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌‌ను అనుకరించడమంటే అంత తేలికైన విషయం కాదు. ఏమాత్రం పట్టుతప్పినా..  కాలు జారి పిచ్‌పై దొర్లాల్సిందే. షార్ట్‌ రనప్‌తో అతడి బౌలింగ్‌ యాక్షన్ అంత వైవిధ్యంగా ఉంటుంది. గంటకు 145కి.మీపైగా వేగం, ఖచ్చితత్వంతో కూడిన బంతులేయడంలో తనకు తానే సాటి. అలాంటి బుమ్రా మాదిరిగా ఓ పాకిస్థాన్‌ పిల్లాడు బౌలింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అచ్చు బుమ్రాలా పరుగెత్తడమే కాదు, యార్కర్లూ విసురుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ కంటపడగా.. అతను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ పిల్లాడు బౌలింగ్‌కు మాజీ దిగ్గజం ఫిదా అయిపోయాడు. 

పాకిస్థానీ బుమ్రా

బుమ్రాలా రనప్‌, బంతిని సంధించే విధానం, బాల్‌ డెలివరీ అయ్యాక అతని హావభావాలను పొల్లుబోకుండా అనుకరిస్తున్న సదరు బుడతడిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్స్ ఆ పిల్లాడిని 'పాకిస్థానీ బుమ్రా' అని ముద్దుగా పిలుస్తున్నారు.