నవాజ్ షరీఫ్​కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట

  • అల్ అజీజియా స్టీల్ మిల్ కేసులో నిర్దోషిగా ప్రకటన

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరటనిచ్చింది. అల్ అజీజియా స్టీల్ మిల్ అవినీతి కేసులో మంగళవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ  స్టీల్ మిల్లును ప్రముఖ వ్యాపారవేత్త, నవాజ్ షరీఫ్​ తండ్రి మహమ్మద్ షరీఫ్ 2001లో సౌదీ అరేబియాలో  స్థాపించారు. ఆ సమయంలో నవాజ్ కూడా సౌదీ అరేబియాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. దీంతో పాకిస్తాన్ నుంచి తరలించిన అక్రమ సంపాదనతో ఈ మిల్లును స్థాపించారని నవాజ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అయితే, ఈ మిల్లుకు హెడ్ గా నవాజ్ కొడుకు హుస్సేన్ షరీప్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంలో నవాజ్ షరీఫ్​ విఫలమయ్యారు. దీంతో యాంటీ కరప్షన్ కోర్టు 2018లో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను విధించింది. తాజాగా ఇస్లామాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో నవాజ్​కు జైలు శిక్ష రద్దయింది.