పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకీ దిగజారుతూ వస్తోంది. ఆ జట్టు పసికూన జట్లపై గెలవలేక నానా తంటాలు పడుతుంది. కనీసం సొంతగడ్డపై సిరీస్ గెలవలేక ఆపసోపాలు పడుతుంది. ఫార్మాట్ ఏదైనా పరాజయాలు ఆ జట్టును పలకరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో పాక్ గెలుపు రుచి చూడక సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ గా ఉన్న షాన్ మసూద్ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ గెలవలేదు. నవంబర్ 2023 లో బాబర్ అజామ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న మసూద్ కు బ్యాడ్ లక్ వెంటాడుతుంది.
అతను కెప్టెన్సీ చేసిన ఆరు మ్యాచ్ ల్లోనూ పాకిస్థాన్ కు పరాభవం తప్పలేదు. ఈ ఆరు మ్యాచ్ ల్లో షాన్ మసూద్ కెప్టెన్సీ చేశాడు. అతను బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా కెప్టెన్ గా ఘోరంగా విఫలమవుతున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆ జట్టు 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. ఆ తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో 0-2 తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. తాజాగా ముల్తాన్ లో ముగిసిన మొదటి టెస్టులోనూ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ కెప్టెన్ గా షాన్ మసూద్ ను పాక్ క్రికెట్ బోర్డు తప్పించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో షాన్ కెప్టెన్ గా కొనసాగుతాడు. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికా టూర్ కు పాకిస్థాన్ వెళ్లనుంది. ఈ సిరీస్ కు కొత్త కెప్టెన్ ను ప్రకటించే అవకాశం ఉంది. మహ్మద్ రిజ్వాన్ , సల్మాన్ అలీ అఘా లలో ఒకరికి పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తున్నారట. రిజ్వాన్ గత కొంతకాలంగా పాకిస్థాన్ అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్నాడు. అఘా సైతం టెస్ట్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. పాక్ జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న సౌద్ షకీల్ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత సంవత్సర కాలంలో పాక్ కెప్టెన్, కోచ్ ల విషయంలో చాలా మార్పులు చేసింది.
Shan Masood likely to lose his Test captaincy. (Samaa TV). pic.twitter.com/KrPYpaDCHV
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024